Share News

విజయ్‌కు వింత చిక్కులు.. మద్దతు 'బయటి' నుంచి.. షరతులు 'లోపలి' నుంచి!

ABN , Publish Date - May 08 , 2026 | 07:47 PM

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం కొలువుదీరడానికి అడుగులు పడుతున్నా, మద్దతివ్వడానికి వామపక్షాలు, వీసీకే, కాంగ్రెస్ పెడుతున్న షరతులు విజయ్ తలని బొప్పికట్టించేలా ఉన్నాయి. అటు కాంగ్రెస్, ఇటు వామపక్షాలు, వీసీకే తమ మద్దతుకు సంబంధించి కీలక ప్రకటనలు చేశాయి.

విజయ్‌కు వింత చిక్కులు..  మద్దతు 'బయటి' నుంచి.. షరతులు 'లోపలి' నుంచి!
Left Parties Offer Outside Support to Vijay’s TVK; VCK Puts Conditions

చెన్నై, మే 8: తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం కొలువుదీరడానికి అడుగులు పడుతున్నా.. మిత్రపక్షాల షరతులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అటు కాంగ్రెస్, ఇటు వామపక్షాలు వీసీకే (VCK) తమ మద్దతుకు సంబంధించి కీలక ప్రకటనలు చేశాయి. విజయ్ ప్రభుత్వంలో భాగస్వామ్యంపై వామపక్షాలు (CPI, CPM) తమ వైఖరిని స్పష్టం చేశాయి. టీవీకే ప్రభుత్వానికి తాము కేవలం బయటి నుంచే మద్దతు ఇస్తామని.. కేబినెట్‌లో చేరే ఉద్దేశం లేదని లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి. ప్రస్తుత రాజకీయ అనిశ్చితిని తొలగించి, ఒక సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న ఉద్దేశంతోనే విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు వారు తెలిపారు.

ఇక, టీవీకేకు ముందుగానే మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. విజయ్‌కు ఒక కీలకమైన షరతు విధించింది. భవిష్యత్తులో టీవీకే ఎట్టి పరిస్థితుల్లోనూ మతతత్వ పార్టీలతో (బీజేపీ వంటి) చేతులు కలపకూడదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ షరతుకు లోబడి ఉంటేనే.. తమ 5 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని హైకమాండ్ వర్గాలు వెల్లడించాయి.


తిరుమావళవన్ షరతు: తిరుచ్చి ఈస్ట్ స్థానంపై కన్ను

ప్రభుత్వ ఏర్పాటులో అత్యంత కీలకమైన 2 స్థానాలు కలిగిన విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) అధినేత తోల్ తిరుమావళవన్ తనదైన వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. వచ్చే ఉపఎన్నికల్లో (విజయ్ రాజీనామా వల్ల ఖాళీ అయ్యే) తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలని ఆయన షరతు పెట్టారు. తిరుమావళవన్ స్వయంగా తిరుచ్చి ఈస్ట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ స్థానం ఇస్తేనే టీవీకేకు మద్దతుపై తుది సంతకం చేసే అవకాశం ఉంది.

వామపక్షాలు కేబినెట్‌లో చేరకపోవడం వల్ల విజయ్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకే ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. కానీ, తిరుమావళవన్ కోరుతున్న 'తిరుచ్చి ఈస్ట్' స్థానం విషయంలో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి..

ఏపీ ECET - 2026 ఫలితాల విడుదల

రాయలసీమకు దూసుకొస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2026 | 08:36 PM