అన్నాడీఎంకేలో అంతర్గత పోరు.. సీనియర్ నేత సెమ్మలై రాజీనామా
ABN , Publish Date - May 18 , 2026 | 03:10 PM
అన్నాడీఎంకేకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్.సెమ్మలై రాజీనామా చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి చవిచూడటం, పార్టీలో అంతర్గత సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో సెమ్మలై రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.
చెన్నై: అన్నాడీఎంకేకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్.సెమ్మలై (S.Semmalai) రాజీనామా చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి చవిచూడటం, పార్టీలో అంతర్గత సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో సెమ్మలై రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. జయలలిత మరణం తర్వాత పార్టీలో పెరుగుతున్న వర్గపోరు, సీనియర్లకు సరైన గుర్తింపు లేకపోవడంతో మనస్తాపం చెంది రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి పంపారు.
పార్టీలో ఇటీవల తలెత్తిన పరిణామాలపై సెమ్మలై తన రాజీనామా లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీని ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్లిన రివల్యూషనరీ నేత ఎంజీఆర్, అమ్మ (జయలలిత) ఇలాంటి పరిణామాలను ఎన్నడూ ఊహించి ఉండరని, పార్టీలోని అంతర్గత కలహాలపై మీడియాలో వస్తున్న కథనాలు కూడా పార్టీ దిగజారుడు పరిస్థితికి అద్దంపడుతున్నాయని అన్నారు. జయలలిత మరణాంతరం తనను పక్కకు పెట్టేశారని, అయినప్పటికీ తన మనోభావాలను బయటపెట్టకుండా క్రమశిక్షణతో పార్టీలో కొనసాగుతూ వచ్చానని చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకెంతమాత్రం పార్టీలో కొనసాగేందుకు తన మనసు అంగీకరించడం లేదన్నారు.
పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్, జయలలిత తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారని, రాజకీయ రంగంలో తన పురోగతికి ఎంతో సహకరించారని ఆయన గుర్తు చేసుకున్నారు. బరువెక్కిన హృదయంతో పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సెమ్మలై తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 2001-2004 మధ్యలో తమిళనాడు ఆరోగ్య, విద్యాశాఖ మంత్రిగా ఆయన సేవలందించారు. 1980లో తొలిసారి తారామంగళం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత అన్నాడీఎంకేలో చేరారు. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలను బహిరంగంగా వ్యతిరేకించిన సీనియర్ నేతల్లో ఆయన కూడా ఒకరు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలే కానీ ఉచితాలు మంచిది కాదని సూచించేవారు.
ఇవి కూడా చదవండి..
కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వీడీ సతీశన్
6 నెలల్లో టీవీకే ప్రభుత్వం కుప్పకూలుతుంది.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..