Share News

మూల్యాంకనంలో ఏఐ వాడలేదు

ABN , Publish Date - May 18 , 2026 | 02:41 AM

సీబీఎస్ఈ 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించలేదని బోర్డు స్పష్టం చేసింది. మూల్యాంకన ప్రక్రియ మొత్తం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో....

మూల్యాంకనంలో ఏఐ వాడలేదు

విమర్శల నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు వివరణ

న్యూఢిల్లీ, మే 17: సీబీఎస్ఈ 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించలేదని బోర్డు స్పష్టం చేసింది. మూల్యాంకన ప్రక్రియ మొత్తం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఆన్‌ స్ర్కీన్‌ మార్కింగ్‌ (ఓఎస్ఎం) విధానంలో జరిగిందని వెల్లడించింది. ఈ ఏడాది సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో చాలామంది విద్యార్థులకు ఊహించని విధంగా తక్కువ మార్కులు వచ్చాయి. ఆన్‌ స్ర్కీన్‌ మార్కింగ్‌ విధానం వల్లే మార్కులు తగ్గాయని, జవాబు పత్రాలు సరిగా దిద్దలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు వివరణ ఇచ్చుకుంది. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ కూడా మూల్యాంకన విధానంపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. ఓఎస్ఎం విధానంలో తప్పులు జరిగే అవకాశం లేదని, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ విద్యా బోర్డులు అనుసరిస్తున్న అత్యుత్తమ విధానమని పేర్కొన్నారు. ‘దాదాపు 98 లక్షల జవాబు పత్రాలను ఓఎస్ఎం విధానంలో మూల్యాంకనం చేయగా..13వేల జవాబు పత్రాలకు దిద్దుబాటు, తదుపరి సమీక్ష అవసరమైందని గుర్తించారు. దీంతో వాటిని మాన్యువల్‌గా పరిశీలించారు’ అని తెలిపారు. ఐసీఏఐ, ఐబీ, కేంబ్రిడ్జ్‌ వంటి సంస్థలు కూడా ఓఎస్‌ఎం విధానాన్నే అనుసరిస్తున్నాయని చెప్పారు. కాగా, ఈ ఫలితాలపై అసంతృప్తిగా ఉన్న విద్యార్థులకు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా స్కాన్‌ చేసిన కాపీలు, మార్కుల పునఃపరిశీలన చేసుకునేందుకు బోర్డు అవకాశం కల్పించింది. అవసరమైతే రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రతి జావాబు పత్రం నకలుకు రూ.100, ప్రతి ప్రశ్నకు రూ.25 ఫీజు చెల్లించాలని పేర్కొంది. సమీక్ష తర్వాత మార్కులు పెరిగితే ఈ ఫీజు తిరిగి చెల్లిస్తారని పేర్కొంది.

Updated Date - May 18 , 2026 | 02:41 AM