Share News

చినాబ్ బ్రిడ్జిపై గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ పరుగులు

ABN , Publish Date - Oct 03 , 2026 | 07:44 AM

జమ్మూకశ్మీర్‌లోని చినాబ్ నదిపై నిర్మించిన, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జిపై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెట్టింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో బ్రిడ్జిని దాటింది.

చినాబ్ బ్రిడ్జిపై గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వందే భారత్ పరుగులు

ఇంటర్‌నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని చినాబ్ నదిపై నిర్మించిన, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జిపై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెట్టింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో బ్రిడ్జిని దాటింది. శ్రీమాత వైష్ణోదేవి కత్రా-బనిహాల్ సెక్షన్‌లో నిర్మించిన ఈ బ్రిడ్జిపై గురువారం వందే భారత్ రైలును నార్తర్న్ రైల్వే విజయవంతంగా పరీక్షించింది. దీంతో ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా లింక్ (యూఎస్‌బీఆర్ఎల్) ప్రాజెక్టులో మైలురాయిని సాధించినట్లయింది.


శ్రీమాత వైష్ణోదేవి కత్రా-బనిహాల్ సెక్షన్‌లో రైలు వేగం గంటకు ఇంతకుముందు 75 కిలోమీటర్లు ఉండగా దానిని 111 కిలోమీటర్లకు పెంచామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఉచిత్ సింఘాల్ తెలిపారు. దేశంలోనే మొదటి కేబుల్ బ్రిడ్జి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్ బ్రిడ్జిని దాటడం ద్వారా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 26401/26404) రికార్డు సాధించిందని సింఘాల్ చెప్పారు. కాగా.. యూఎస్‌బీఆర్ఎల్ ప్రాజెక్టులో 111 కిలోమీటర్ల కత్రా-బనిహాల్ సెక్షన్ చాలా కీలకమైనది. కశ్మీర్ లోయ, దేశంలోని మిగతా ప్రాంతాల మధ్య నిరంతర రైలు కనెక్టివిటీని అందించేందుకు ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.


100 కిలోమీటర్లకు రైల్వే ఆమోదం

శ్రీమాత వైష్ణోదేవి కత్రా-బనిహాల్ సెక్షన్‌లో రైలు వేగాన్ని గంటకు 100 కిలోమీటర్లకు పెంచారు. నిరుడు ఆగస్టులో రైల్వే శాఖ అధికారులు ఆ మార్గాన్ని పరిశీలించి రైలు గరిష్ట వేగాన్ని 100 కిలోమీటర్లుగా నిర్ధారించారు. ఆ మేరకు అనుమతి ఇవ్వాలంటూ రైల్వే అధికారులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కేంద్రం ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ సెక్షన్‌లోనూ రైళ్లు గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో వెళ్లడానికి అనుమతించారు. ఇప్పుడు వేగ పరిమితిని గంటకు 100 కిలోమీటర్లకు పెంచడంతో ప్రయాణికులు తక్కువ సమయంలోనే తమ గమ్యస్థానానికి చేరేందుకు వీలవుతుంది. కాగా.. రియాసీ, అంజి ఖాద్ రైల్వే బ్రిడ్జి వద్ద చినాబ్ నదిపై ఆ కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. ఇక ఈ సెక్షన్‌లో 33 సొరంగాలు ఉన్నాయి. నిరుడు జూన్ 6న కత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను శ్రీమాత వైష్ణోదేవి కత్రా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి..

హనుమాన్‌ చాలీసా చదివి ధైర్యం తెచ్చుకున్నా..

చంపేస్తున్న ‘సెకండ్‌ స్మోకింగ్‌’

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 03 , 2026 | 08:06 AM