Share News

హనుమాన్‌ చాలీసా చదివి ధైర్యం తెచ్చుకున్నా..

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:18 AM

తన ప్రాణాల కోసం పోరాడుతూనే, ఇతరులను కూడా చావనివ్వకూడదని నిర్ణయించుకున్నానని.. హనుమాన్‌ చాలీసా పఠించి ధైర్యం తెచ్చుకున్నానని ఫ్లైదుబాయ్‌ విమానం భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌ ప్రధాని మోదీకి చెప్పారు.

హనుమాన్‌ చాలీసా చదివి ధైర్యం తెచ్చుకున్నా..

  • నా ప్రాణాల కోసం పోరాడుతూనే ఇతరులనూ చావనివ్వకూడదనుకున్నా..

  • కత్తిపోట్లతో పడిపోయినా తీవ్రంగా కష్టపడి కాక్‌పిట్‌ తలుపు తెరిచా..

  • ప్రధాని మోదీతో పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌

  • వీడియోకాల్‌ చేసి మాట్లాడిన మోదీ

న్యూఢిల్లీ, అక్టోబరు 2: తన ప్రాణాల కోసం పోరాడుతూనే, ఇతరులను కూడా చావనివ్వకూడదని నిర్ణయించుకున్నానని.. హనుమాన్‌ చాలీసా పఠించి ధైర్యం తెచ్చుకున్నానని ఫ్లైదుబాయ్‌ విమానం భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌ ప్రధాని మోదీకి చెప్పారు. తన శరీరంలో శక్తినంతటినీ కూడదీసుకుని విమానాన్ని, ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నించానని వివరించారు. దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌ వెళుతున్న విమానం కూల్చేసేందుకు ప్రయత్నించిన కో-పైలట్‌ తనను అడ్డుకున్న పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌పై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన మచ్చార్‌ ప్రస్తుతం అబుధాబిలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ప్రధాని మోదీ ఆయనకు వీడియోకాల్‌ చేయగా.. ఆస్పత్రి బెడ్‌పై నుంచే మాట్లాడారు. విమానంలో జరిగిన ఘటనను మోదీకి వివరించారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడల్లా హనుమాన్‌ చాలీసా పఠిస్తానని, దేశానికి దూరంగా ఉన్నా సంస్కృతికి దగ్గరగా ఉన్నానని చెప్పారు. ‘‘విమానంలో నాపై కత్తిపోట్లు జరిగినప్పుడు.. ఓ వైపు నా ప్రాణాల కోసం పోరాడుతున్నాను. అదే సమయంలో ఇతరులు చనిపోకుండా చూడాలని నాకు తెలుసు. విమానం కిందికి జారిపోతోంది, నాకు చాలా గాయాలయ్యాయి. అయినా లేచి ఏదో ఒకటి చేయాలనుకున్నా. తీవ్రంగా ప్రయత్నించి కాక్‌పిట్‌ తలుపు తెరిచా. వెంటనే పరుగెత్తుకు వచ్చిన ప్రయాణికుల సాయంతో అందరినీ కాపాడగలిగాం’’ అని స్మిత్‌ మచ్చార్‌ తెలిపారు. తాను 17 ఏళ్లుగా విమానాలు నడుపుతున్నానని, అందులో 11 ఏళ్లుగా కెప్టెన్‌ (ప్రధాన పైలట్‌)గా ఉన్నానని వివరించారు.


యూఏఈకి కో-పైలట్‌ అప్పగింత

విమానాన్ని కూల్చేందుకు కుట్ర చేసి, అడ్డువచ్చిన పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌పై కత్తితో దాడి చేసిన ఫ్లైదుబాయ్‌ విమానం కో-పైలట్‌ను సౌదీ అరేబియా అధికారులు యూఏఈకి అప్పగించారు. కెప్టెన్‌ మచ్చార్‌తోపాటు కో-పైలట్‌కు కూడా చికిత్స అనంతరం యూఏఈ భద్రతా సిబ్బంది రక్షణ మధ్య అబుధాబికి తరలించినట్టు తెలిపారు. అయితే కో-పైలట్‌ పేరు, ఇతర వివరాలేమీ అధికారికంగా వెల్లడించలేదు. కాగా, ఫ్లైదుబాయ్‌ విమాన ఘటనను ఉగ్రవాద చర్య అని యూఏఈ అధ్యక్షుడి సలహాదారు అన్వర్‌ గర్గాష్‌ అభివర్ణించారు. దాడి వెనుక ఉద్దేశం, ఇతరుల ప్రమేయం తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. భారతీయ పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌ను నిజమైన హీరో అంటూ ప్రశంసించారు.


మీ క్షేమం కోసం దేశం ప్రార్థిస్తోంది: మోదీ

మచ్చార్‌ ధైర్యసాహసాలు, సమయస్పూర్తి అసమానమని మోదీ అభినందించారు. ‘‘స్మిత్‌ మచ్చార్‌ 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు. ప్రపంచం ఇప్పుడు భారతీయ పైలట్లను కొత్త దృష్టితో చూస్తుంది. ఇది మనకు గర్వకారణం’’ అని పేర్కొన్నారు. ‘‘భారతీయులు ప్రాణాలు తీసేవారు కాదు.. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసేవారని ఈ ఘటనతో భారతదేశం గర్వంగా చాటి చెబుతోంది’’ అని అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు హనుమాన్‌ చాలీసా పఠించడాన్ని అభినందించారు. స్మిత్‌ మచ్చార్‌ గుజరాత్‌కు చెందినవారు కావడంతో ఆయనతో మోదీ కాసేపు గుజరాతీ భాషలోనూ మాట్లాడారు. మచ్చార్‌ క్షేమం కోసం దేశం ప్రార్థిస్తోందని, చాలా మంది మహామృత్యుంజయ మంత్రం పఠిస్తున్నారని చెప్పారు. మిమ్మల్ని స్వాగతించేందుకు భారత్‌ ఎదురుచూస్తోందన్నారు. ఆయనకు మంచి వైద్యం అందేలా చూసిన సౌదీ, యూఏఈ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మోదీతో మాట్లాడటం గర్వంగా ఉందని స్మిత్‌ చెప్పారు.

Updated Date - Oct 03 , 2026 | 03:19 AM