Share News

ఎరువుల సబ్సిడీకి 62,370 కోట్లు

ABN , Publish Date - Nov 12 , 2026 | 03:01 AM

ప్రస్తుత రబీ సీజన్‌లో ఎరువుల సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం రూ.62,370 కోట్లు కేటాయించింది

ఎరువుల సబ్సిడీకి 62,370 కోట్లు
PM Modi

  • రబీ సీజన్‌లో వాడే యూరియాయేతర ఎరువులకు

  • రూ.3,230 కోట్లతో ఢిల్లీలో యుగే యుగీన్‌ భారత్‌ మ్యూజియం ఏర్పాటు

  • సూక్ష్మ పరిశ్రమలకు ‘ముద్ర’ క్రెడిట్‌ గ్యారెంటీ మరో ఐదేళ్లు

  • స్టాండప్‌ ఇండియా పథకం కూడా 2031 దాకా పొడిగింపు

  • కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలు

న్యూఢిల్లీ, నవంబరు 11: ప్రస్తుత రబీ సీజన్‌లో ఎరువుల సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం రూ.62,370 కోట్లు కేటాయించింది. 2026 అక్టోబరు నుంచి 2027 మార్చి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా రైతులు పంటల్లో వాడే ఫాస్పాటిక్‌, పొటాషిక్‌(పీకే) ఎరువులకు న్యూట్రియెంట్స్‌ బేస్డ్‌ సబ్సిడీ(ఎన్‌బీఎస్) రేట్ల కింద ఈ సబ్సిడీని అందజేస్తారు. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన క్యాబినెట్‌ సమావేశంలో ఎరువుల సబ్సిడీతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటి మొత్తం బడ్జెట్‌ రూ.77,101 కోట్లు. క్యాబినెట్‌ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎన్‌బీఎ్‌స పథకం కింద నైట్రోజన్‌, ఫాస్పరస్‌, పొటాష్‌, సల్ఫర్‌ (ఎన్‌పీకేఎస్) ఎరువులతోపాటు డీఏపీకి ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీ ఇస్తోంది. ప్రస్తుత రబీ సీజన్‌లో నైట్రోజన్‌ ఎరువులకు కిలోకు రూ.94.21 సబ్సిడీ నిర్ణయించారు. ఫాస్పరస్‌ ఎరువులకు కిలోకు రూ.66.11, సల్ఫర్‌ ఎరువులకు కిలోకు రూ.10.42 సబ్సిడీ ఇవ్వనున్నారు. పొటాష్‌ ఎరువులకు గతంతో పోల్చితే ఏమార్పూ లేకుండా కిలోకు రూ.2.38 ఖరారు చేశారు. అమెరికా-ఇరాన్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాల వల్ల ఎరువుల ముడిపదార్థాలకు కొరత ఏర్పడినప్పటికీ.. ఆ ప్రభావం రైతులపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. డీఏపీ 50 కిలోల బస్తా ధరను రూ.1,350 వద్దే కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీకి కేంద్రం రూ.1,70,977 కోట్లు కేటాయించింది.


ఇందులో యూరియా సబ్సిడీకి అత్యధికంగా రూ.1.16 లక్షల కోట్లు ఇవ్వగా, ఎన్‌బీఎస్ పథకానికి రూ.54,000 కోట్లు కేటాయించారు. అయితే, గత ఖరీఫ్‌, ప్రస్తుత రబీ సీజన్లలో కలిపి ఎన్‌బీఎస్ పథకానికి సబ్సిడీ రూ.1,03,903 కోట్లకు చేరింది. ఈ నెల 10వేదీ నాటికి దేశంలో యూరియా నిల్వలు 103.12 లక్షల టన్నులు, డీఏపీ నిల్వలు 28.65 లక్షల టన్నులు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో ఏ ఎరువులకూ కొరత లేదని తెలిపారు.

మరో ఐదేళ్లపాటు ముద్రా యోజన

ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) పథకం కింద సూక్ష్మ పరిశ్రమలకు క్రెడిట్‌ గ్యారంటీని మరో ఐదేళ్లపాటు కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌ ఫర్‌ మైక్రో యూనిట్స్‌ (సీజీఎఫ్ఎంయూ) పథకాన్ని 2031 మార్చి వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపిందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ముద్రా యోజన లోన్ల కోసం రూ.5,000 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఇవ్వటానికి ఆమోదం తెలిపింది. సీజీఎ్‌ఫఎంయూ ద్వారా ఈ ఏడాది సెప్టెంబరు నాటికి సూక్ష్మ పరిశ్రమలకు రూ.43.34 లక్షల కోట్ల విలువైన 60.36 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో మరో రూ.12.6 లక్షల కోట్ల విలువైన గ్యారంటీ లేని (కొల్లేటరల్‌ ఫ్రీ) రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన స్టాండప్‌ ఇండియా పథకాన్ని కూడా 2031 మార్చి 31 వరకు పొడిగించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. ఈ పథకం కింద మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణాలు ఇప్పిస్తారు.


ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం యుగే యుగీన్‌..

భారతదేశ 5 వేల ఏళ్ల చరిత్రను భవిష్యత్‌ తరాలకు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించేలా ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంను ఏర్పాటు చేసేందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని నార్త్‌, సౌత్‌ బ్లాక్‌ కాంప్లెక్స్‌లో యుగే యుగీన్‌ భారత్‌ మ్యూజియం పేరుతో దీనిని ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం రూ.3,230 కోట్లను క్యాబినెట్‌ కేటాయించారు. ఈ మ్యూజియం 1,78,509 చదరపు మీటర్ల వైశాల్యంలో ఉంటుంది. ఈ మ్యూజియంను 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి దశలవారీగా ఏర్పాటు చేస్తారు. మొదటి గ్యాలరీ వచ్చే ఏడాది చివరికల్లా అందుబాటులోకి రావొచ్చు. కాగా, నోయిడాను గ్రేటర్‌ నోయిడాతో అనుసంధానించేందుకు ఉద్దేశించిన మెట్రో రైల్‌ కారిడార్‌ విస్తరణకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. 8.449 కిలోమీటర్ల పొడవైన ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌కు రూ.2,390 కోట్లు కేటాయించింది.

ఇవి కూడా చదవండి..

వివాహేతర బంధంపై అభ్యంతరం.. ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి

దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తోందా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు

Updated Date - Nov 12 , 2026 | 04:22 AM