అర్థం లేకుండా విమర్శలు చేస్తారా?: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:05 PM
ఏపీలోని మదనపల్లెలో ఈనెల 2న జరిగిన కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చేసిన పోస్టుపై అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య రాజకీయ దుమారం నెలకొంది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఏపీలోని మదనపల్లెలో ఈనెల 2న జరిగిన కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చేసిన పోస్టుపై అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య రాజకీయ దుమారం నెలకొంది. ఆ కార్యక్రమంలో కొంతమంది ఉద్యోగాలు కావాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను డిమాండ్ చేశారని, ఆమె మాట్లాడుతుండగా మధ్యలో అడ్డుకున్నారని సులేమాన్ ఖాన్ అనే వ్యక్తి ఎక్స్‌లో పోస్టు చేశాడు. ఆ పోస్టును జైరాం రమేష్ రీపోస్ట్ చేస్తూ నిర్మలపై విమర్శలు చేశారు.
‘‘ప్రజల్లో కేంద్రంపై ఎంత వ్యతిరేకత ఉందో కేంద్ర ఆర్థిక మంత్రి స్వయంగా చూస్తున్నారు. ఉద్యోగాలు కావాలని అడిగిన వారికి.. ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని నచ్చచెప్పాల్సి వచ్చింది’’ అని జైరాం ట్వీట్ చేశారు. దీంతో ఆయన పోస్టుపై ఎన్డీఏ, టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను నిర్మలా సీతారామన్ కొట్టివేశారు. ‘‘నమ్మలేకపోతున్నా. ఆ పోస్టుపై జైరాం అర్థం లేకుండా స్పందించారు. ఆ కార్యక్రమానికి హాజరైన టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు వాస్తవానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలనుకున్నారు. ఆ ఇద్దరు లీడర్లను కలిసేందుకు ఆ కార్యకర్తలు ఎంతో ఉత్సాహం చూపారు. కార్యక్రమం ముగిసిన తర్వాతే తమను కలవాలని చంద్రబాబు వారికి సూచించారు. కానీ, జైరాం మాత్రం ఏదో పోస్టు చేశారు’ అని నిర్మల ట్వీ్ట్ చేశారు.
జైరాంకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కౌంటర్
జైరాం రమేష్ చేసిన పోస్టుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘జైరాంజీ.. మీరు చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నాయి. అక్కడ జరిగిన దానిని ప్రజల కోపంగా మీరు చిత్రీకరిస్తున్నారు. కానీ, ప్రజల నుంచి ఆ కార్యక్రమానికి ఊహించని స్పందన వచ్చింది. దీంతో కార్యక్రమం సజావుగా సాగేందుకే నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చింది’’ అని చంద్రబాబు ‘ఎక్స్’ లో రిప్లై ఇచ్చారు. వాస్తవాలను ధ్రువీకరించుకోకుండా జైరాం రమేష్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని లోకేశ్ కూడా మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యుద్ధ విరమణ కోసం భారత్ చేసిన ప్రతిపాదనలు బాగున్నాయి
రష్యా డ్రోన్ దాడి.. ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్ ధ్వంసం
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..