India-US: ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్
ABN , Publish Date - Jan 12 , 2026 | 03:02 PM
వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో ట్రంప్ భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని గోర్ చెప్పారు. భారత్‌కు అమెరికా రాయబారిగా ఆయన సోమవారంనాడు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా రాయబారి సెర్జియో గోర్ (Sergio Gor) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహబంధం నిజమైనదని అన్నారు. నిజమైన స్నేహితుల మధ్య విభేదాలు సహజమేనని, వాటిని పరిష్కరించుకుని ముందుకు సాగేందుకే వారు ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో ట్రంప్ భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. భారత్‌కు అమెరికా రాయబారిగా ఆయన సోమవారంనాడు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమకు భారత్ తర్వాతే ఎవరైనా అని చెప్పారు.
'ఇండియాతో భాగస్వామ్యం కంటే మాకు ఎవరూ ఎక్కువ కాదు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను మరో స్థాయికి తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తాను' అని గోర్ చెప్పారు. అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం విషయంలో సంక్లిష్టతలు ఉన్నప్పటికీ వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు రెండు దేశాల ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. ఈనెల 13న భారత్-అమెరికా ప్రతినిధులు మరోసారి సమావేశం కావాల్సి ఉందని వెల్లడించారు. భారతదేశం ప్రపచంలోనే అతిపెద్ద దేశమని, అందువల్ల ఒప్పందంపై ముగింపునకు తీసుకురావడం అంత తేలికైన పనికాదని, అయినప్పటికీ సాధ్యమైనంత త్వరగా ఒప్పందం కుదిరేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. భద్రత, కౌంటర్ టెర్రరిజం, ఇంధనం, సాంకేతికత, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో రెండు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతుందని తెలిపారు.
సిలికాన్ ఆధారిత సాంకేతికతలను రక్షించడానికి, మెరుగుపరచడానికి ఉద్దేశించిన 'ప్యాక్స్ సిలికా' కూటమిలోకి పూర్తి సభ్యత్వ దేశంగా భారత్‌ను ఆహ్వానిస్తున్నామని గోర్ వెల్లడించారు. కూటమిలో అమెరికా, జపాన్, సౌత్ కొరియా, యూకే, ఇజ్రాయెల్ దేశాలు కలిసి పనిచేయనున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్
బెంగళూరు-విజయవాడ హైవే.. నాలుగు గిన్నీస్ రికార్డులు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి