టీఎంసీలో తిరుగుబాటు.. ఆజాద్-దూబె మధ్య మాటల యుద్ధం
ABN , Publish Date - Jun 12 , 2026 | 02:50 PM
తృణమూల్ కాంగ్రెస్‌లో నెలకొన్న తిరుగుబాటు రాజకీయ దుమారానికి దారితీసింది. ఆ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబె మధ్య సోషల్ వేదికగా మాటల యుద్ధం సాగింది. వివరాల్లోకెళితే...
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం మరింత వేడెక్కుతోంది. తృణమూల్ కాంగ్రెస్‌లో నెలకొన్న తిరుగుబాటు రాజకీయ దుమారానికి దారితీసింది. టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబె మధ్య.. ఎక్స్ సోషల్ వేదికగా మాటల యుద్ధం సాగింది. టీఎంసీని చీల్చేందుకే ఆపరేషన్ లోటస్ పేరిట ప్రయత్నాలు సాగుతున్నాయని కీర్తి ఆజాద్ ఆరోపించారు.
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాశ్ బారిక్.. నిశికాంత్ దూబె ఇంటి ముందే మీడియాతో మాట్లాడారన్నారు ఆజాద్. పలువురు టీఎంసీ నేతలు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలవడమూ ఇందులో భాగమని పేర్కొన్నారు. కానీ పార్టీని బలహీనపరిచే ఈ కుట్రలన్నీ విఫలమయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. తననూ తిరుగుబాటులో చేరాలని పలువురు బీజేపీ ఎంపీలు, ఆ పార్టీ నేతలు సంప్రదించారని ఆరోపించిన ఆయన.. భద్రతా సిబ్బందిని తగ్గించి ఒత్తిడి తెస్తున్నప్పటికీ తాను లొంగనని స్పష్టం చేశారు.
ఆజాద్ వ్యాఖ్యలపై నిశికాంత్ దూబె స్పందిస్తూ.. తన నివాసం ముందు ఎవరైనా మీడియా సమావేశం నిర్వహించుకోవచ్చన్నారు. ఆజాద్‌తో దశాబ్దకాలం పాటు బీజేపీలో కలిసి పనిచేశానని, ఆయన తండ్రి తనకు సంరక్షకుడిలాంటి వారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆయన స్వగ్రామం తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనే ఉందని కూడా పేర్కొన్నారు. దూబె మాటలపై మరోసారి స్పందించిన కీర్తి ఆజాద్.. తమ మధ్య వ్యక్తిగత విభేదాలేవీ లేవని స్పష్టం చేశారు. రాజకీయ శత్రుత్వం ఎంతున్నా దాన్ని వ్యక్తిగత అంశాలకు ఆపాదించకూడదని ఆయన హితవు పలికారు. ఆపరేషన్ లోటస్ విషయాన్నే తాను ప్రస్తావించానని, దీనికి ప్రత్యేక ఆధారాలేం అక్కర్లేదన్న ఆయన.. పార్లమెంట్‌లో దూబెను కలుస్తానని చెప్పారు.
ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ సంక్షోభం ముదురుతోంది. పార్టీకి చెందిన 28 మంది లోక్‌సభ సభ్యుల్లో 19 మంది బహిరంగంగా తిరుగుబాటు చేసినట్లు సమాచారం. వారు తమ అభ్యంతరాలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ద్వారా సమర్పించినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు.. పార్టీపై అసంతృప్తితో ఇప్పటికే పలువురు నేతలు రాజీనామాలు చేసిన విషయం సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
నేటి నుంచే ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్.. పాక్‌తో భారత్ పోరు.. ఎప్పుడంటే?
భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత