టీఎంసీ అహకారం మొదటి విడతలోనే ముక్కలైంది: మోదీ
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:55 PM
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి అనుకూల పవనాలు వీస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తొలి విడత పోలింగ్‌లో భారీ ఓటింగ్‌తో టీఎంసీకి గట్టి దెబ్బ తగిలిందని, తుది విడత ముగిసేసరికి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
బంగావ్: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి అనుకూల పవనాలు వీస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. తొలి విడత పోలింగ్‌లో భారీ ఓటింగ్‌తో టీఎంసీకి గట్టి దెబ్బ తగిలిందని, తుది విడత ముగిసేసరికి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. పశ్చిమబెంగాల్‌లోని బంగావ్‌లో ఆదివారంనాడు జరిగిన భారీ ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. 'తొలి విడత పోలింగ్‌లో టీఎంసీ అహంకారం ముక్కలైంది. రెండో దశలో బీజేపీకి కీలక విజయం దక్కనుంది' అని చెప్పారు.
టీఎంసీ హయాంలో చిన్నస్థాయి నేతలు, గూండాలు సైతం అధికారం తమదే అన్నట్టు వ్యవహరించడంతో పాలన గాడితప్పిందని, జవాబుదారీతనం లోపించిందని మోదీ విమర్శించారు. 'మా, మాటీ, మానుష్' నినాదంతో టీఎంసీ ఎంతోకాలం నమ్మించలేదని, ఈ మూడు విషయాల్లోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. తల్లులు అనేక బాధలకు గురయితే, భూములు దుర్వినియోగమయ్యాయని, ప్రజలు గత్యంతరం లేక వలసబాటలు పట్టారని విమర్శించారు.
రైతుల సంక్షేమానికి బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తోందని, రైతులు, కూలీల ఆందోళనలను తాము ఆర్థం చేసుకున్నామని చెప్పారు. ఆ కారణంగా గత 11 ఏళ్లపై బీజేపీ ప్రభుత్వం జనపనారకు కనీస మద్దతుధరను రెట్టింపు చేసిందని, గోదుమలు, బియ్యం ప్యాకింగ్ 100 శాతం జనపనారతో ఉండటం తప్పనిసరి చేశామని అన్నారు. అయితే జనపనార మిల్లులను టీఎంసీ సిండికేట్ అనుమతించడం లేదని, ఇక్కడి రైతుల సంక్షేమ కోసం టీఎంసీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందని చెప్పారు. 'మార్పు తప్పనిసరి' అనేది మాత్రమే బెంగాల్ ఏకైక నినాదం కావాలని మోదీ పిలుపునిచ్చారు. కాగా, ఈనెల 29న మిగిలిన 142 స్థానాలకు రెండో దశ పోలింగ్ జరుగనుంది.
ఇవి కూడా చదవండి..
నాయకత్వ మార్పుపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ : డీకే శివకుమార్
ఫిరాయింపు ఎంపీలపై వేటు.. రాజ్యసభ చైర్మన్‌కు ఆప్ వినతి పత్రం