నాయకత్వ మార్పుపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ : డీకే శివకుమార్
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:08 PM
నాయకత్వ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కట్టుబడి ఉంటామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు. పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తనకుఉందని అన్నారు.
బెంగళూరు: నాయకత్వ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాను, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కట్టుబడి ఉంటామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు. పార్టీ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తనకుఉందని అన్నారు. ఢిల్లీ నుంచి ఆదివారంనాడు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న డీకే కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు.
మే 4న నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కర్ణాటకలో నాయకత్వ మార్పు, మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గత రెండు రోజులుగా హస్తినలో డీకే ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో అధిష్టానంతో జరిపిన చర్చలపై మీడియా ప్రశ్నించగా, సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుందని, ఇప్పటికి చెప్పేదేమీ లేదని అన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలున్నట్టు సీనియర్ మంత్రి సతీష్ జార్కిహోలి పేర్కొనడంపై అడిగినప్పుడు అలాంటిదేమీలేదని డీకే సమాధానమిచ్చారు. ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో నాయకత్వ మార్పు జరిగే అవకాశాలపై అడిగినప్పుడు, ఈ అంశాన్ని తాను ఎప్పుడూ ప్రస్తావించలేదని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను, ముఖ్యమంత్రి కట్టుబడి ఉంటామని చెప్పారు.
బ్యానర్లు, ప్రకటనలు వద్దు
మే 15న తన పుట్టినరోజున ఎవరూ రోడ్లపై బ్యానర్లు పెట్టడం కానీ, అడ్వర్‌టైజ్‌మెంట్లు కానీ ఇవ్వవద్దని డీకే కోరారు. రోడ్లపై ఎలాంటి ఇబ్బందులు కలిగించ వద్దని పార్టీ కార్యకర్తలను, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఫ్లెక్సీలు పెట్టేవారిపై కేసులు పెట్టాలని, జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించనున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఫిరాయింపు ఎంపీలపై వేటు.. రాజ్యసభ చైర్మన్‌కు ఆప్ వినతి పత్రం
పవన శక్తిలో భారత్ నాలుగో స్థానంలో ఉంది: ప్రధాని మోదీ