ఫిరాయింపు ఎంపీలపై వేటు.. రాజ్యసభ చైర్మన్‌కు ఆప్ వినతి పత్రం
ABN , Publish Date - Apr 26 , 2026 | 03:13 PM
పార్టీ ఫిరాయింపులకు పాల్పడి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారంనాడు కోరింది. ఈ మేరకు సీపీ రాధాకృష్ణన్‌కు ఆప్ సీనియర్ నేత సంజయ్‌సింగ్ వినతిపత్రం సమర్పించారు.
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులకు పాల్పడి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆదివారంనాడు కోరింది. ఈ మేరకు సీపీ రాధాకృష్ణన్‌కు ఆప్ సీనియర్ నేత సంజయ్‌సింగ్ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంపీల చర్యలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని అన్నారు.
ఎంపీల ఫిరాయింపులు ప్రజాతీర్పునకు ద్రోహం చేయడమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమని సంజయ్‌సింగ్ తెలిపారు. ముఖ్యంగా ఫిరాయింపులకు పాల్పడిన వారిలో ఆరుగురు పంజాబ్ నుంచి ఆప్ టిక్కెట్టుపై ఎన్నికయ్యారని చెప్పారు. ఇప్పడు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆక్షేపణ తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు వారి సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా రాజ్యసభ చైర్మన్‌ను కోరినట్టు చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి గత శుక్రవారంనాడు గట్టి దెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి ఫిరాయించారు. రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్బజన్ సింగ్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని, స్వాతి మలివాల్‌లు బీజేపీలో విలీనమైనట్టు ప్రకటించారు. కేజ్రీవాల్ పార్టీ ఏ సిద్ధాంతాలతో మొదలైందో ఆ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిందని వారు ఆరోపించారు. తమ విలీనాన్ని సమర్ధించుకుంటా మూడింట రెండువంతుల మంది మరో సంస్థలో విలీనమయ్యేందుకు రాజ్యాంగ నిబంధన అనుమతిస్తుందని రాఘవ్ చద్దా చెప్పారు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి 10 మంది సభ్యులుండగా అవసరమైన దానికంటే ఎక్కువ మంది సభ్యులు తమ గ్రూప్‌లో ఉన్నట్టు తెలిపారు. అయితే ఈ వాదనను సంజయ్ సింగ్ తోసిపుచ్చారు. సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సహా పలువురు రాజ్యాంగ నిపుణులను తాము సంప్రదించామని, చట్టప్రకారం ఆప్ నుంచి ఫిరాయించిన ఎంపీలు అనర్హతకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పవన శక్తిలో భారత్ నాలుగో స్థానంలో ఉంది: ప్రధాని మోదీ
ప్రెస్ డిన్నర్‌లో కాల్పులు.. దాడిని ఖండించిన ప్రధాని మోదీ