పవన శక్తిలో భారత్ నాలుగో స్థానంలో ఉంది: ప్రధాని మోదీ
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:53 PM
పవన శక్తి విషయంలో భారత్ మరో మైలురాయిని సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో 56 గిగావాట్లకు పైగా పవన శక్తి ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ఆదివారం మన్‌కీ బాత్ కార్యక్రమంలో పలు విషయాలపై ప్రధాని మోదీ ప్రసంగించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పవన శక్తి విషయంలో భారత్ మరో మైలురాయిని సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో 56 గిగావాట్లకు పైగా పవన శక్తి ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. గతేడాదితో పోలిస్తే 6 గిగావాట్ల పవన శక్తి అదనంగా ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడించారు. పవన శక్తిలో భారత్ నాలుగో స్థానంలో ఉందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే సౌర, పవన శక్తి ముఖ్యమని పేర్కొన్నారు. పునరుత్పాదక విద్యుత్‌తో భవిష్యత్ భద్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆదివారం మన్‌కీ బాత్ కార్యక్రమంలో పలు విషయాలపై ప్రధాని మోదీ ప్రసంగించారు.
బుద్ధ పూర్ణిమ నేపథ్యంలో భారతీయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘శాంతి మన లోపలే మొదలవుతుందని భగవాన్ బుద్ధుడు బోధించారు. తనను తాను జయించడమే అన్నిటికంటే గొప్ప విజయమని ఆయన మనకు తెలియజేశారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఉద్రిక్తతలు, సంఘర్షణల మధ్య.. బుద్ధుని బోధనలు ఎంతో ముఖ్యమైనవిగా మారాయి. ప్రపంచం బుద్ధుని బోధనలను అనుసరించాలి’ అని అన్నారు.
జన గణన గురించి మోదీ మాట్లాడుతూ.. ‘జన గణన కేవలం ప్రభుత్వ పని మాత్రమే కాదు. ఇది మనందరి బాధ్యత. జన గణనలో మీ భాగస్వామ్యం ఎంతో కీలకం. మీరు ఇచ్చే సమాచారం పూర్తిగా సురక్షితం, గోప్యంగా ఉంచబడుతుంది. జన గణన 2027ని విజయవంతం చేద్దాం’ అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
న్యూక్లియర్ సైంటిస్టుల గురించి మోదీ మాట్లాడుతూ.. ‘మన న్యూక్లియర్ సైంటిస్టులు ఒక గొప్ప విజయం ద్వారా భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ 'క్రిటికాలిటీ'ని సాధించింది. ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కోసం కృషి చేసిన వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నా’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి
పల్లీ కట్లి.. తయారు చేసుకోండిలా..
కోహ్లీ తర్వాత ఆ ట్యాగ్ అయ్యర్‌కే దక్కాలి: ఇర్ఫాన్ పఠాన్