Share News

విజయ్ ఆస్తుల విలువ రూ.404 కోట్లు.. అఫిడవిట్‌లో వెల్లడి

ABN , Publish Date - Mar 30 , 2026 | 09:23 PM

తనకు రూ.404.58 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో విజయ్ పేర్కొన్నారు. తన భార్య సంగీతకు రూ.15.51 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్టు తెలిపారు.

విజయ్ ఆస్తుల విలువ రూ.404 కోట్లు.. అఫిడవిట్‌లో వెల్లడి
Vijay

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న టీవీకే అధినేత విజయ్ (Vijay) తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. పెరంబూర్‌ నియోజకవర్గం నుంచి సోమవారంనాడు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో పొందుపరిచారు. తనకు రూ.404.58 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అందులో పేర్కొన్నారు. తన భార్య సంగీతకు రూ.15.51 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్టు తెలిపారు. విజయ్‌కు తగినంత బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నట్టు అఫిడవిట్ వెల్లడించింది. సాలిగ్రామంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు బ్రాంచిలో రూ.213.36 కోట్ల సేవింగ్స్ ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ ఇందిరా నగర్ బ్రాంచ్‌లో రూ.5.79 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి.


లగ్జరీ కార్లు, విలువైన ఆభరణాలు

తన వద్ద పలు లగ్జరీ కార్లు ఉన్నట్టు అఫిడవిట్‌లో విజయ్ పేర్కొన్నారు. బీఎండబ్ల్యూ 530, టయోటా వెల్‌ఫైర్ వంటి పలు లగ్జరీ కార్లు ఇందులో ఉన్నాయి. వాటి విలువ రూ.6 కోట్ల వరకూ ఉంది. తనకు రూ.1.20 కోట్లు విలువచేసే 883 గ్రాముల బంగారం ఉందని పేర్కొన్నారు. తన భార్య వద్ద రూ.4.07 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్టు వెల్లడించారు. కోటి రూపాయలు విలువైన డైమండ్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.


పెట్టుబడులు

వ్యక్తిగత ఆస్తులు, బ్యాంకు అకౌంట్లతో పాటు కంపెనీలు, ట్రస్టులు, వ్యాపార సంస్థల్లో గణనీయంగా విజయ్ పెట్టుబడులు పెట్టారు. గ్లోబల్ కంపెనీల్లో, వ్యాపారాల్లో రూ.56 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్టు చెప్పారు. విద్య, సామాజిక సంస్థలు, కంపెనీలలో ఈ పెట్టుబడులు పెట్టామని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

పెరంబూర్‌లో నామినేషన్ వేసిన విజయ్

నామినేషన్ వేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్

Updated Date - Mar 30 , 2026 | 09:24 PM