ఉజ్జయిని ఉద్రిక్తం.. పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
ABN , Publish Date - Sep 28 , 2026 | 01:35 PM
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. నగరంలోని రోడ్డు విస్తరణ ప్రాజెక్టు కోసం షాహి మసీదులో కొంత భాగాన్ని కూల్చివేయాలని ఉజ్జయిని మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. కార్పొరేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక వర్గానికి చెందిన వ్యక్తులు నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని రోడ్డు విస్తరణ ప్రాజెక్టు కోసం షాహి మసీదులో కొంత భాగాన్ని కూల్చివేయాలని ఉజ్జయిని మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. కార్పొరేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక వర్గానికి చెందిన వ్యక్తులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు మసీదు ప్రాంతంలో బందోబస్తు నిర్వహించారు. ఆందోళనకారుల్లో కొంతమంది పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించాలని పోలీసులు విజ్ఞప్తి చేసినా ప్రదర్శనకారులు వినలేదు. పరిస్థితి చేజారిపోయే ప్రమాదం కనిపించడంతో పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. రాళ్లు విసురుతున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. కొన్ని గంటల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా.. రోడ్డు విస్తరణ పనుల కోసం షాహి మసీదులోని కొంత భాగంతో పాటు ఇతర 272 నిర్మాణాలను కూడా కూల్చివేయనున్నారు.
ఖజుర్ వలీ మసీదు నుంచి గణేశ్ చౌక్ వరకు 730 మీటర్ల పొడవునా రోడ్డు వేయనున్నారు. వచ్చే సింహస్థ కుంభమేళా కోసం రూ.9.8 కోట్ల ఖర్చుతో ఈ రోడ్డు వేయనున్నారు. కాగా.. ఈ ప్రాజెక్టు కోసం షాహి మసీదులో కొంత భాగాన్ని కూల్చివేయాలన్న ఉజ్జయిని మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా పలువురు దాఖలు చేసిన పిటిషన్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు ఇదివరకే కొట్టివేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీ ఓటు చోరీ చేసి మోసం చేసింది: మంత్రి ఉత్తమ్
రేవంత్.. ఆ ఆధారాలు చూపెట్టు.. కేటీఆర్ సవాల్
హైదరాబాద్‌లో దారుణం.. భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త
Read Latest Telangana News And AP News And National News
And Telugu News