అమిత్ షా యూసీసీ ప్రకటనపై ఆచితూచి స్పందిస్తున్న మిత్రపక్షాలు
ABN , Publish Date - Sep 15 , 2026 | 08:24 AM
ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని అమిత్ షా ప్రకటించారు. అయితే దీనిపై కూటమిలో ఉన్న తెలుగు దేశం సహా మరో రెండు పార్టీలు ఆచితూచి స్పందిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలున్న 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ)ని అమలు చేస్తామన్న కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటనపై ఆ కూటమికి చెందిన మూడు పార్టీలు ఆచితూచి స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు దేశం, జనతా దళ్(యూ), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పార్టీలు యూసీసీ ప్రకటన అనంతరం ఆలోచనలో పడినట్టు సమాచారం.
ఇప్పటివరకు తాము ఉమ్మడి పౌర స్మృతిపై ఎలాంటి చర్చ జరపలేదని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. అవసరమైనప్పుడు దానిని పరిశీలిస్తామని ఆయన వివరించారు. మరోవైపు జనతా దళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా స్పందిస్తూ.. యూసీసీ అమలుకు ముందు అమిత్ షాను కలిసి చర్చిస్తానని పేర్కొన్నారు. ఆ పార్టి చీఫ్ నితీశ్ కుమార్ గతంలో ఉమ్మడి పౌర స్మృతి విధానానికి మద్దతిచ్చారు. అయితే అన్ని వర్గాలతో చర్చించాకే దాన్ని అమలు చేయాలని చెప్పారు. అలాగే లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వివిధ వర్గాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, సమగ్ర చర్చలు జరిపాకే యూసీసీపై తమ వైఖరిని వెల్లడిస్తామని తెలిపారు.
తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో 2029 ఎన్నికలకు ముందే ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు యూసీసీ గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అమలవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
అనంతపురం జిల్లాలో ఇంట్లోకి దూసుకెళ్లిన టాటా సఫారీ.. ఒకరి మృతి
కర్నూల్ జిల్లా గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో మంత్రి టీజీ భరత్ భేటీ