కర్నూల్ జిల్లా గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో మంత్రి టీజీ భరత్ భేటీ
ABN , Publish Date - Sep 14 , 2026 | 07:49 PM
ఎల్‌నినో నేపథ్యంలో వినాయకుడి విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలనే అంశంపై మంత్రి టీజీ భరత్.. గణేష్ ఉత్సవ కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఆనవాయితీని పాటించాలా.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలా.. అనే అంశంపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది.
కర్నూల్, సెప్టెంబర్ 14: ఎల్‌నినో నేపథ్యంలో వినాయకుడి విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలనే అంశంపై మంత్రి టీజీ భరత్ గణేష్ ఉత్సవ కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. కర్నూల్ కలెక్టరేట్‌లో జరిగిన ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దీంతో నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో వినాయక విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలనే అంశంపై మంత్రి కర్నూల్ జిల్లాలోని గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో విస్తృత స్థాయిలో చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి వేరే చోట నిమజ్జనం చేయాలని కమిటీ సభ్యులను అధికారులు ఒప్పించే ప్రయత్నం చేశారు.
అయితే, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని.. గణేశ్ విగ్రహాలను కేసీ కెనాల్‌లోనే నిమజ్జనం చేయడానికి అనుమతి ఇవ్వవలసిందిగా ఉత్సవ కమిటీ సభ్యులు మంత్రిని కోరారు. 45 ఏళ్లుగా కేసీ కెనాల్‌లోనే నిమజ్జనం చేస్తున్నామని.. ఆనవాయితీకి విరుద్దంగా వేరే చోట నిమజ్జనం చేయలేమని వారు విన్నవించుకున్నారు.
దీనిపై స్పందించిన మంత్రి.. భక్తుల నమ్మకాలను గౌరవిస్తూ.. కేసీ కెనాల్ వినాయక ఘాట్‌లోనే నిమజ్జనం చేయడానికి అనుమతి ఇచ్చారు. గణేశ్ నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం.. కేసీ కెనాల్ ఘాట్‌లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేయవలసిందిగా కర్నూల్ నగరపాలక సంస్థ ఉన్నతాధికారులకు మంత్రి టీజీ భరత్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read:
ఈ 4 రాశులపై వినాయకుడి కటాక్షం.. కెరీర్, వ్యాపారంలో ఇక విజయాలే!
వినాయక చవితి 2026.. చంద్రుడిని ఎందుకు చూడకూడదు? ఈ పురాణ కథ తెలుసా?