Share News

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఆయుధ, ఆర్థిక, సైనిక సామర్థ్యానికి భారీ దెబ్బ..

ABN , Publish Date - Sep 15 , 2026 | 07:57 AM

ఇరాన్‌తో జరిగిన యుద్ధం అమెరికా సైనిక సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్లు అమెరికా ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడించింది. యుద్ధంలో భారీగా ఆధునిక ఆయుధాలను వినియోగించడంతో అమెరికా వ్యూహాత్మక ఆయుధ నిల్వల్లో కొరత ఏర్పడినట్లు తెలిపింది.

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఆయుధ, ఆర్థిక, సైనిక సామర్థ్యానికి భారీ దెబ్బ..
US-Iran war

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో జరిగిన యుద్ధం అమెరికా సైనిక సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్లు పెంటగాన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ నివేదిక వెల్లడించింది. యుద్ధంలో భారీగా ఆధునిక ఆయుధాలను వినియోగించడంతో అమెరికా వ్యూహాత్మక ఆయుధ నిల్వల్లో కొరత ఏర్పడినట్లు తెలిపింది. అంతేకాకుండా కీలక క్షిపణులు, రక్షణ వ్యవస్థలను తిరిగి సమకూర్చడంలో అమెరికా రక్షణ పరిశ్రమకు ఉత్పత్తి పరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆ నివేదిక హెచ్చరించింది.


ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు జరిగిన పరిణామాలపై రూపొందించిన ఈ నివేదిక.. యుద్ధం కారణంగా అమెరికా సైనిక స్థావరాలు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, దౌత్య కార్యాలయాలకు జరిగిన నష్టాన్నీ వివరించింది. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, ఒమన్, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడుల ప్రభావం పడినట్లు పేర్కొంది. వందలాది భవనాలు, ఇతర నిర్మాణాలు దెబ్బతినగా.. డజన్ల కొద్దీ అమెరికా విమానాలు, డ్రోన్లు ధ్వంసమైనట్లు వెల్లడించింది.


ఇక, ఈ యుద్ధం అమెరికా ఖజానాపైనా భారీ భారాన్ని మోపింది. యుద్ధానికి అప్పటికే సుమారు 37.5 బిలియన్ డాలర్లు ఖర్చయినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ జూలైలో కాంగ్రెస్‌కు తెలిపారు. మరోవైపు ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలోని అమెరికా దౌత్య కేంద్రాలకు సుమారు 184 మిలియన్ డాలర్ల భౌతిక నష్టం వాటిల్లినట్లు నివేదిక అంచనా వేసింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత మధ్యప్రాచ్యం, యూరప్ దేశాల నుంచి సుమారు 9,000 మంది అమెరికన్లను తరలించారు. ఈ తరలింపు చర్యలకు జూన్ చివరి నాటికి 11 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చయింది. ఈ ఖర్చులను అమెరికన్ల నుంచి తిరిగి వసూలు చేయబోమని స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.


అయితే, ఓవైపు ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నప్పటికీ.. మరోవైపు భారీ స్థాయిలో ఆయుధ విక్రయాలను కొనసాగించింది అమెరికా. నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 మధ్య 44 బిలియన్ డాలర్లకు పైగా అత్యవసర, సాధారణ సైనిక ఆయుధ విక్రయాలు నమోదయ్యాయి. ఇందులో సౌదీ అరేబియాకు అత్యధికంగా హెలికాప్టర్లు, మందుగుండు సామగ్రి, అధునాతన కచ్చితత్వ ఆయుధాలు విక్రయించగా.. ఖతార్, కువైట్, యూఏఈ, ఇజ్రాయెల్ కూడా భారీ స్థాయిలో అమెరికా సైనిక పరికరాలను పొందాయి.


అమెరికా ఆయుధ నిల్వలపై యుద్ధ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. అదే సమయంలో మిత్రదేశాలకు కొనసాగుతున్న ఆయుధ సరఫరా.. అమెరికా రక్షణ పరిశ్రమపై మరింత ఒత్తిడి పెంచే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.


ఈ వార్తలు కూడా చదవండి

రష్యా, ఉక్రెయిన్‌లు అందుకు అంగీకరించాయి: డొనాల్డ్ ట్రంప్

హోర్ముజ్ భద్రత కోసం అమెరికాకు డబ్బులు చెల్లించాలి.. దేశాలకు ట్రంప్ డిమాండ్..

Updated Date - Sep 15 , 2026 | 08:05 AM