Share News

డ్రోన్ అనుకుని నాటో జెట్‌ల హడావుడి.. తీరా చూస్తే..

ABN , Publish Date - Sep 14 , 2026 | 07:05 PM

డ్రోన్ వచ్చిందనుకున్నారు.. హడావుడి మొదలైంది. వెంటనే నాటో యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. రాడార్‌లో కనిపించిన అనుమానాస్పద కదలికను అడ్డుకునేందుకు పైలట్లు దూసుకెళ్లారు. కానీ అక్కడికి చేరుకున్నాక అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. సమీపానికి వెళ్లి చూడగా వలస వెళ్తున్న పక్షుల గుంపుగా తేలింది.

డ్రోన్ అనుకుని నాటో జెట్‌ల హడావుడి.. తీరా చూస్తే..
NATO Drone Alert

ఇంటర్నెట్ డెస్క్: బాల్టిక్ ప్రాంతంలో అనుమానాస్పద డ్రోన్ కదలికలు కనిపించడంతో నాటో బలగాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఉత్తర లిథువేనియాలోని సియౌలియై నుంచి నాటో బాల్టిక్ వైమానిక రక్షణ మిషన్‌లో ఉన్న ఇటాలియన్ వైమానిక దళం యుద్ధ విమానాన్ని హుటాహుటిన గాల్లోకి పంపించింది. గ్రౌండ్ రాడార్‌లో నిషేధిత గగనతలంలో తక్కువ ఎత్తులో ఓ గుర్తుతెలియని వస్తువు కదులుతున్నట్లు గుర్తించడంతో రక్షణ సిబ్బంది వెంటనే స్పందించారు. ఇటీవలి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, తూర్పు ఐరోపాలో పెరిగిన గగనతల నిఘా నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాన్నీ తేలిగ్గా తీసుకోకుండా పైలట్లను లక్ష్యాన్ని గుర్తించేందుకు పంపించారు. అయితే కోఆర్డినేట్‌లకు చేరుకున్న పైలట్లకు అసలు విషయం తెలిసి ఆశ్చర్యం ఎదురైంది. రాడార్‌లో అనుమానాస్పద డ్రోన్‌గా కనిపించినది వాస్తవానికి పెద్ద సంఖ్యలో వలస వెళ్తున్న పక్షుల గుంపుగా తేలింది.


ప్రాథమిక రాడార్ రీడింగ్‌లలో పక్షులు, డ్రోన్‌లు సృష్టించే గుర్తులు ఒకేలా కనిపించే అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, అనుమానాస్పద వస్తువులపై వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో లిథువేనియా విల్నియస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. అయితే కేవలం 38 నిమిషాల్లోనే పరిస్థితిపై స్పష్టత రావడంతో హెచ్చరికను ఉపసంహరించి విమానాశ్రయాన్ని తిరిగి తెరిచారు. ఫిన్లాండ్, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా గగనతలాల్లోకి సైనిక డ్రోన్లు ప్రవేశిస్తున్న ఘటనలు ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం రష్యా సరిహద్దులకు సమీపంలోని నాటో దేశాలపై కూడా పడుతోందన్న ఆందోళనల మధ్య, రాడార్‌లో కనిపించిన ప్రతి అనుమానాస్పద కదలికను భద్రతా బలగాలు అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నాయి.


ఇవి కూడా చదవండి...

నల్లగొండలో కేటీఆర్‌ పాదయాత్ర చేస్తే.. నేనూ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి

బీఆర్ఎస్‌కు దమ్ముంటే తలసానికి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలి: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 07:14 PM