Share News

రాజ్యసభలో అడుగుపెట్టనున్న విజయ్ టీవీకే

ABN , Publish Date - May 23 , 2026 | 07:48 PM

తమిళనాడులో ఇటీవల అధికారంలోకి వచ్చిన విజయ్ సారథ్యంలోని టీవీకే త్వరలో రాజ్యసభలోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాజ్యసభలో ఖాళీగా ఉన్న 12 రాష్ట్రాల్లోని 26 సీట్లకు ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ అధికారికంగా ధ్రువీకరించింది. ఇందులో తమిళనాడు కూడా ఉంది.

రాజ్యసభలో అడుగుపెట్టనున్న విజయ్ టీవీకే
Vijay

న్యూఢిల్లీ: తమిళనాడులో ఇటీవల అధికారంలోకి వచ్చిన విజయ్ (Vijay) సారథ్యంలోని టీవీకే (TVK) త్వరలో రాజ్యసభ (Rajya Sabha)లోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాజ్యసభలో ఖాళీగా ఉన్న 12 రాష్ట్రాల్లోని 26 సీట్లకు ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ అధికారికంగా ధ్రువీకరించింది. ఇందులో తమిళనాడు కూడా ఉంది.


ఎన్నికల కమిషన్ ప్రకటించిన రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు రాజ్యసభ ఎంపీల పదవీకాలం పూర్తికావచ్చింది. వీరిలో మాజీ ప్రధాని దేవెగౌడ, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఇద్దరు కేంద్ర మంత్రులు రవ్నీత్ సింగ్ బిట్టు, జార్జ్ కురియన్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల్లో నాలుగేసి రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరుగనుండగా, మధ్యప్రదేశ్, రాజ్యస్థాన్‌లో మూడేసి రాజ్యసభ స్థానాలకు, జార్ఖాండ్‌లో రెండు సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. మణిపూర్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక్కో సీటుకు ఎన్నిక జరుగనుంది. వీటితో పాటు మహారాష్ట్ర, తమిళనాడులోనూ ఒక్కో రాజ్యసభ సీటుకు ద్వైవార్షిక ఎన్నిక జూన్ 18న జరుగనుంది.


ఎన్నికల జరుగునున్న 26 సీట్లలో ఎన్డీయే 18, కాంగ్రెస్‌ 4, వైఎస్ఆర్ కాంగ్రెస్‌ 3, జార్ఖాండ్ ముక్తిమోర్చా ఒక స్థానం కలిగి ఉన్నాయి. ఎన్నికల తర్వాత ఎన్డీయే ఒక సీటును కోల్పోయి 17కు చేరే అవకాశం ఉండగా, కాంగ్రెస్ సీట్లు 4 నుంచి 5కు పెరిగే అవకాశం ఉంది. జేఎంఎం రెండు సీట్లు గెలుచుకోగలిగే పొజిషన్‌లో ఉంది. అదనంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ పార్టీ టీవీకే ఒక సీటును గెలుచుకోనుందనే అంచనాలు ఉన్నాయి. అజిత్ పవార్ వర్గం ఎన్‌సీపీ సైతం ఒక సీటును గెలుచుకోగలుగుతుంది.


బలాబలాలు

ప్రస్తుతం రాజ్యసభలో 244 స్థానాలు ఉండగా, ఎన్డీయేకు 149 ఎంపీలు ఉన్నాయి. విపక్షాలకు 78 సీట్లు ఉన్నాయి. ఎన్డీయే లేదా విపక్ష 'ఇండియా' కూటమితో పొత్తు కలిగిన పార్టీలకు 17 సీట్లు ఉన్నాయి. అయితే 'ఇండియా' కూటమి నుంచి డీఎంకే వైదొలగడంతో ఈ లెక్కల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు. కర్ణాటకలోని 4 సీట్లలో కాంగ్రెస్ 3 సీట్లు గెలుచుకునే పొజిషన్‌లో ఉండగా, బీజేపీ ఒక సీటు దక్కించుకోగలదు. మూడేసి స్థానాలున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో రెండేసి సీట్లు బీజేపీకి వెళ్లనుండగా, ఒక్కో స్థానం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. గుజరాత్‌లో నాలుగు సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంటుంది. దీంతో కాంగ్రెస్‌కు గుజరాత్ నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 4 సీట్లు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఖాతాలోని వెళ్లనున్నాయి. జార్ఖాండ్‌లో జేఎంఎం, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండటంతో రెండు సీట్లూ కూటమికే దక్కుతాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నుంచి ఒక సీటును కాంగ్రెస్ కోరనుంది. అయితే ఇక్కడ బీజేపీ కూడా ఒక అభ్యర్థిని దించే వీలుంది. బీహార్ తరహాలో క్రాస్ ఓటింగ్ జరిగితే తమకు కలిసొచ్చే అవకాశం ఉంటుందని బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. తమ మంత్రులైన రవ్నీత్ సింగ్ బిట్టు, జార్జి కురియన్‌లను బీజేపీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున బిట్టును రాజ్యసభకు తీసుకువెళ్లాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.


కర్ణాటక నుంచి రాజ్యసభకు మల్లికార్జున్ ఖర్గే పోటీ చేయడం దాదాపు ఖాయమనే చెప్పాలి. ఆయన రెండోసారి రాజ్యసభలో కొనసాగాలని ఆశిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి కమల్‌నాథ్ నామినేషన్ వేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కర్ణాటక నుంచి హెచ్‌డీ దేవెగౌడను రాజ్యసభకు పంపేందుకు బీజేపీ మద్దతిస్తుందా, సొంత అభ్యర్థిని నిలబెడుతుందా అనేది ప్రశ్నగానే ఉంది. కర్ణాటక నుంచి ఒక సీటును బీజేపీ సునాయాసంగా గెలుచుకోగలదు.


ఇవి కూడా చదవండి..

కర్ణాటక నుంచి రాజ్యసభ రేసులో ఖర్గే, దేవెగౌడ

మోదీకి ఝల్‌మురి అమ్మిన విక్రమ్‌ సావోకు బెదిరింపులు

Updated Date - May 23 , 2026 | 07:51 PM