గార్డును కొట్టి జైలు నుంచి 17 మంది ఖైదీల పరార్.. తమిళనాడులో ఘటన
ABN , Publish Date - Oct 27 , 2026 | 08:42 AM
సెక్యూరిటీ గార్డును కొట్టి 17 మంది ఖైదీలు జైలు నుంచి సినీ ఫక్కీలో పరారయ్యారు. తమిళనాడులోని తేని జిల్లా అండిపట్టి సమీపంలోని తెక్కంపట్టి సబ్ జైలులో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: సెక్యూరిటీ గార్డును కొట్టి 17 మంది ఖైదీలు జైలు నుంచి సినీ ఫక్కీలో పరారయ్యారు. తమిళనాడులోని తేని జిల్లా అండిపట్టి సమీపంలోని తెక్కంపట్టి సబ్ జైలులో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైదీలు తమకు గాయాలైనట్లు నటించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు వారి వద్దకు వెళ్లగా.. ఖైదీలు ఆ గార్డును కొట్టి పరారయ్యారు. ఖైదీలను లింగం, రాజా సింగధర్, కరప్పుసామి, సిలంబరసన్, తిరుపతి, మెంజిసుందరం, శబరి, పోన్ ముత్తు, నిజంత్, కార్తీక్ రాజా, ముగిలన్, సెల్వ, తరుణ్, రాజ్ కుమార్, ప్రవీణ్, ముత్తు ఇళంగో, రాజువిన్‌గా గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అలాగే, ఈ ఘటనపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
పారిపోయిన ఖైదీల్లో నలుగురిని ఇప్పటికే పట్టుకుని కస్టడీలోకి తీసుకున్నారు. రాష్ర్ట్రంలోని అన్ని చెక్‌పాయింట్లు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తేనికి పొరుగున ఉన్న జిల్లాల్లో నిఘాను పెంచారు. విలుప్పురం జిల్లాలో తీవ్రంగా నిఘా పెట్టారు. ఖైదీల్లో చాలా మంది విలుప్పురం జిల్లాకు చెందిన వారిగా భావిస్తున్నారు. ఖైదీలు ఎలా తప్పించుకున్నారన్న దానిపై దర్యాప్తు ప్రారంభించామని దిండిగుల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్.జయకుమార్ తెలిపారు. భద్రతా లోపం ఏమైనా ఉందా అని అనుమానిస్తున్నామని, దానిపైనా దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఖైదీల పరారీకి బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్
SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్