ఫారం-6లో ఏ మార్పూ చేయలే
ABN , Publish Date - Oct 27 , 2026 | 02:09 AM
కొత్త ఓటర్ల నమోదు కోసం తప్పనిసరి అయిన ఫారం -6లో ఎలాంటి మార్పులూ చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సుప్రీంకోర్టుకు తెలిపింది.
మార్చే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంది
సర్‌పై నిర్ణయాలన్నీ సమష్టిగా తీసుకున్నవే
పత్రిక కథనం ఆధారంగా ఈసీపై నింద సరికాదు
న్యాయస్థానంలో వార్తా కథనం సాక్ష్యంగా చెల్లదు
ఈఆర్‌వో అనుమతి లేకుండా ఈసీఐనెట్‌లో ఓట్ల చేర్పు, తొలగింపు కుదరదు
సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం అఫిడవిట్
న్యూఢిల్లీ, అక్టోబరు 26: కొత్త ఓటర్ల నమోదు కోసం తప్పనిసరి అయిన ఫారం -6లో ఎలాంటి మార్పులూ చేయలేదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా కీలక నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారన్న ఆరోపణలను తోసిపుచ్చింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)కు సంబంధించి కమిషన్ నిర్ణయాలన్నీ సమష్టిగా తీసుకున్నవేనని స్పష్టంచేసింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో సోమవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈసీలు సుఖ్‌బీర్‌సింగ్ సంధు, వివేక్ జోషీలు అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోకుండా సీఈసీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించటంతో దేశవ్యాప్తంగా దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ వార్తా కథనం ఆధారంగా రాకేశ్‌కుమార్‌సింగ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కోవారెంటో రిట్‌ను దాఖలు చేశారు. ఏ అధికారంతో సీఈసీ సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారో వివరణ కోరాలని అభ్యర్థించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఈసీలో నిర్ణయాలు ఏకగ్రీవంగా అయినా, లేదంటే మెజారిటీ ప్రకారం తీసుకోవాలని గుర్తుచేశారు. ఎస్‌ఐఆర్‌పై కమిషన్ తీసుకున్న నిర్ణయాలన్నీ చెల్లవని ప్రకటించాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. వివరణ ఇవ్వాలని ఈసీని ఈ నెల 5న ఆదేశించింది. దీంతో 15 అంశాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్‌ను ఈసీ సోమవారం దాఖలు చేసింది. ఇదే అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతోపాటు మరికొందరు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. వాటన్నింటిని కలిపి ధర్మాసనం విచారించనుంది. ఒక వార్తా సంస్థ ప్రచురించిన కథనం న్యాయస్థానంలో సాక్ష్యంగా చెల్లదని ఈసీ తన అఫిడవిట్‌లో వాదించింది. వార్తా కథనం ఆధారంగా ఈసీ విశ్వసనీయతను ప్రశ్నించటం సరికాదని పేర్కొంది.
అఫిడవిట్‌లో ఈసీ పేర్కొన్న అంశాలు..
ఈ అఫిడవిట్‌ను సీఈసీ, ఇద్దరు ఈసీల ఏకగ్రీవ ఆమోదంతో దాఖలుచేశారు. 2025 జూన్, అక్టోబరు, 2026 మేలో ఎస్‌ఐఆర్‌పై విడుదల చేసిన మూడు ఆదేశాలూ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాల ఆధారంగా జారీచేసినవే అన్నారు.
ఒక ఫైలుపై చర్చ సమయంలో ఈసీలు, సీఈసీ ఇచ్చే నోట్స్, సలహాలు, వ్యక్తంచేసే అభ్యంతరాలు కమిషన్ నిర్ణయాలుగా పరిగణించబడవు.
ఒక అంశానికి సంబంధించిన ఫైలు మొదట ఒక కమిషనర్ వద్దకు వెళ్తుంది. అటు నుంచి మరో కమిషనర్ వద్దకు వెళ్తుంది. చివరగా సీఈసీ వద్దకు వెళ్తుంది. అత్యవసర సమయాల్లో ఎలకా్ట్రనిక్ మాధ్యమంలో నిర్ణయాలు తీసుకొని, ఆ తర్వాత వాటిని రికార్డు చేస్తారు. ఈసీలో తన పరిధిని దాటి ఏ అధికారి ఆదేశాలిచ్చినా శిక్షను ఎదుర్కొంటారు.
డిప్యూటేషన్‌పై ఉన్న అదనపు కార్యదర్శి జూలై 28న ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఇద్దరు ఈసీలు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. జూలై 30 ఇద్దరు ఈసీలు సంయుక్తంగా ఇచ్చిన ఆదేశాల వల్ల అదనపు కార్యదర్శి జారీచేసిన ఆదేశాల అమలు నిలిచిపోయింది.
ఫారం-6లో ఈసీ ఎలాంటి మార్పులూ చేయలేదు. అందులో మార్పులు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ఎస్‌ఐఆర్ డిక్లరేషన్ ఫారం -6లో భాగం కాదు. అది ప్రత్యేకమైన పత్రం.
ఎస్‌ఐఆర్ డిక్లరేషన్ కూడా ఫారం-6లో భాగమనే అభిప్రాయం ఏర్పడినందున ఈ నెల 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల్లో ఈ రెండిండిని విడిగా చూపుతున్నాం. భౌతికంగా కూడా ఈ రెండు పత్రాలు వేర్వేరుగా ఉంటాయి.
ఓటర్ల జాబితాలో మ్యాపింగ్ కాని ఓటర్లు ఎన్నికల అధికారుల వద్ద విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదు. బీఎల్‌వోలే స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి తగిన పత్రాలు స్వీకరిస్తారు. అసాధారణ కేసుల్లో మాత్రమే విచారణ ఉంటుంది.
ఈసీఐనెట్‌లో ఈఆర్‌వో అనుమతి లేకుండా ఓటరు నమోదుకానీ, తొలగింపు కానీ సాధ్యం కాదు. అయినా దీనిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఐఐటీ, ఐఐఎ్‌ససీ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేశాం.
గోవాకు చెందిన 97 మంది పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయని ఘటనపై చర్యలు తీసుకున్నాం. వారిలో 88 మంది ఇప్పటికే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఆరుగురు విదేశాల్లో ఉన్నారు. ముగ్గురికి పోర్చుగీసు పాస్‌పోర్టులు ఉన్నాయి.
పశ్చిమబెంగాల్‌లో కొత్తగా ఓటరు జాబితాలో పేర్లు చేర్చటంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు ఆ రాష్ట్ర ఎన్నికల సీఈవో వద్ద అప్పీళ్లు దాఖలు చేశారు. అయితే, ఈ అంశం ఈసీ వద్దకు రాలేదు.
సీఈసీని విధుల నుంచి తప్పించాలన్న పిటిషన్‌కు విచారణార్హత లేదు. సీఈసీని పదవి నుంచి తొలగించాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎలాగైతే తొలగిస్తారో అలాంటి ప్రక్రియే ఉంటుంది.
మీడియాకు కమిషన్ ఎలాంటి అంతర్గత నోట్‌ను విడుదల చేయలేదు. నోట్ విడుదలకు అనుమతి కూడా ఇవ్వలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్
SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్