వాళ్లు సైన్స్ తెలీని మూర్ఖులు.. కేంద్ర మంత్రి సురేష్ గోపి విమర్శలు
ABN , Publish Date - Nov 17 , 2026 | 08:18 PM
పెట్రోల్‌లో ఇథనాల్ శాతం 20 పరిమితి మించిందన్న ఆరోపణలను కేంద్ర మంత్రి సురేష్ గోపి తోసిపుచ్చారు. సైన్స్ తెలియని మూర్ఖులు అంటూ విమర్శించారు.
ఆంధ్రజ్యోతి, నవంబర్ 17: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేస్తున్న పెట్రోల్‌లో ఇథనాల్ (Ethanol) శాతం నిర్దేశిత 20 శాతం పరిమితిని మించిందంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఆరోపణలు చేసేవారు 'సైన్స్ తెలియని మూర్ఖులు'అని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటక, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని నిర్ధారించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, త్రిస్సూర్‌లో ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇథనాల్ మిశ్రమం గురించి కొన్ని దురుద్దేశపూరిత రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని, ముఖ్యంగా అనుమతించిన పరిమితి కంటే ఎక్కువ ఇథనాల్ కలుపుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సురేష్ గోపి విమర్శించారు. 'నేను అలాంటి వ్యక్తులను చెడ్డ మాటలతో తిట్టను. కానీ వారెవరికీ సైన్స్ గురించి కనీస అవగాహన లేని మూర్ఖులు అని మాత్రమే చెబుతాను' అని ఆయన అన్నారు.
ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) ఆమోదం, విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనల తర్వాతే భారత్ 10 శాతం ఇథనాల్ (E10) నుంచి 20 శాతం ఇథనాల్ (E20) ఇంధన విధానానికి మారిందని మంత్రి స్పష్టం చేశారు. పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు 20 శాతం కంటే ఎక్కువ ఇథనాల్ ఉన్న పెట్రోల్ అందే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. 'ఇథనాల్ కలిపే యంత్రాలు అత్యంత కచ్చితత్వంతో రూపొందించినవి.. ఇథనాల్ పరిమాణం 20 శాతానికి చేరుకోగానే వాల్వ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది (Cut off). ఇది నిరూపితమైన సత్యం' అని వివరించారు.
ఎవరైనా సరే పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని పరీక్షించుకోవచ్చని, తాము అలాంటి తనిఖీలను నిరుత్సాహపరచబోమని మంత్రి పేర్కొన్నారు. కల్తీ జరిగిందనే అనుమానం ఉన్న చోట్ల నమూనాలు సేకరించి సీబీఐ (CBI) విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటపడతాయని అన్నారు. పెట్రోల్ వాహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి ఇథనాల్ మిశ్రమం మాత్రమే ఏకైక మార్గమని సురేష్ గోపి అన్నారు. ఇథనాల్ కలపడం వల్ల వాహనాలు దెబ్బతిన్నాయని ఇప్పటివరకు ఒక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా రాలేదని ఆయన స్పష్టం చేశారు.
బ్రెజిల్ దేశంలో E20 కి బదులుగా ఏకంగా E80 (80-85శాతం ఇథనాల్, 14-19శాతం పెట్రోల్) ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారని, అక్కడ అదే ప్రమాణంగా ఉందని గుర్తుచేశారు.
పెట్రోల్‌లో ఇథనాల్ శాతం నిర్దేశిత 20 శాతం పరిమితిని దాటిందని కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం కూడా పెట్రోల్ నమూనాలపై పరీక్షలు నిర్వహించగా, వాటి ఫలితాలు వెలువడాల్సి ఉంది. (Suresh Gopi on Ethanol Blending)
ఇవి కూడా చదవండి...
కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు
కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News