Share News

మా ఆదేశాలనే ధిక్కరిస్తారా?

ABN , Publish Date - Nov 28 , 2026 | 03:34 AM

తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న వివాదాస్పద ఏకశిలా స్తంభంపై కార్తీక దీపం వెలిగించాలంటూ తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

మా ఆదేశాలనే ధిక్కరిస్తారా?
SUPREMECOURT

  • మా ఆదేశాలనే ధిక్కరిస్తారా?

  • దీన్ని ఉక్కు పిడికిలితో ఎదుర్కోవాల్సిందే

  • లేకుంటే రాజ్యాంగ గందరగోళానికి దారితీస్తుంది

  • తిరుప్పరంకుండ్రం వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

  • సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ధర్మకర్తల మండలి సస్పెన్షన్‌

  • నేడు ఏకశిలా స్తంభంపై కార్తీకదీపం వెలిగించాలని ఆదేశం

  • దర్గా చుట్టూ 50 మీ. దూరంలో వెలిగించవచ్చని సూచన

  • ఆలయ పరిసరాల భద్రత బాధ్యతలు సీఆర్‌పీఎఫ్‌కు..

  • నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని తమిళనాడు సీఎస్‌ను ఆదేశించిన ధర్మాసనం

  • డీజీపీ, దేవదాయ శాఖ కార్యదర్శి, కలెక్టర్‌కు నోటీసులు

  • మురుగన్‌కు హరోంహర.. సుప్రీం తీర్పుపై మోదీ హర్షం

చెన్నై, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న వివాదాస్పద ఏకశిలా స్తంభంపై కార్తీక దీపం వెలిగించాలంటూ తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను ధిక్కరించిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్‌ చేసింది. ఆలయ నిర్వహణ, దీపం వెలిగంచే ప్రక్రియను పర్యవేక్షించేందుకు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌. వైద్యనాథన్‌, జస్టిస్‌ వి. పార్తీబన్‌ను ఆలయ ట్రస్ట్‌ రిసీవర్‌లుగా నియమించింది. శనివారం రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించాలని ఆదేశించింది.


sv4 copy.jpg

ఉచ్చిపిళ్లయార్‌ మండపంలో 24న వెలిగించిన జ్యోతి ద్వారానే ఈ దీపాన్ని వెలిగించాలని స్పష్టం చేసింది. ఆలయ పరిసరాల భద్రతను సీఆర్‌పీఎఫ్ కు అప్పగించాలని తేల్చిచెప్పింది. స్తంభం సమీపంలో ఉన్న దర్గాకు అన్నివైపులా కనీసం 50 మీటర్ల దూరంలో ప్రతి భక్తుడూ దీపం వెలిగించవచ్చని ప్రకటించింది. దర్గాను రక్షించాలని, దానిని సందర్శించే ముస్లిం భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని సీఆర్‌పీఎ్‌ఫను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలుకు సంబంధించి అధికారుల మధ్య జరిగిన ఫోన్‌ కాల్స్‌, ఈ-మెయిళ్లు, ఉత్తర ప్రత్యుత్తరాలతో కూడిన సమగ్ర నివేదికను తమ ముందుంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ఆదేశించింది. తదుపరి విచారణకు సీఎస్‌ వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ. అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ విఫుల్‌ పంచోలితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ఏకశిలా స్తంభంపై ఈ ఏడాదికి మాత్రం కార్తీక దీపం వెలిగించుకోచ్చని, ఆలయ ధర్మకర్తల మండలితో పాటు అతి కొద్దిమందిని మాత్రమే ఇందుకు అనుమతించాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని 20న సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు వెలువరించింది. కానీ ధర్మకర్తల మండలి సంప్రదాయానికి అనుగుణంగా ఉచ్చిపిళ్లయార్‌ మండపంపైనే కార్తీకదీపం వెలిగించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయలేకపోయానంటూ మదురై జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కృష్ణ సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. ఈ వ్యవహారాన్ని కోర్టు ధిక్కరణగా భావించాలని కోరుతూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిగింది.


ఈ సంగతేంటో తేలుస్తాం

‘‘ఈ కేసులో జరిగిన పరిణామాల క్రమం చూస్తే అధికారులు తమ రాజకీయ అధిపతుల ఆదేశాల మేరకు పనిచేసినట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులను ఉక్కు పిడికిలితో ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే అది రాజ్యాంగ గందరగోళానికి దారి తీస్తుంది’’ అని ధర్మాసనం కటువుగా వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను పాటించబోమంటూ ఆలయ ధర్మకర్తల మండలి తీర్మానం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘కోర్టు ఆదేశాలను అమలు చేయబోమని మండలి సభ్యులు నిర్ణయించడం తీవ్రమైన ఉల్లంఘనే. దీనికి ఇతర అధికారులు కూడా సహకరిస్తున్నారని స్పష్టమైపోయింది. ఇది సుప్రీం అధికారాన్ని బలహీనపరిచేందుకు ఉద్దేశపూర్వకంగా జరిగిన ప్రయత్నంగానే భావిస్తున్నాం. న్యాయపరమైన ఆదేశాలను పాటించాలా, వద్దా అని నిర్ణయించే అధికారాన్ని తమిళనాడులోని అధికారులు తమకు తామే ఆపాదించుకుంటారా?’’ అని ప్రశ్నించింది. న్యాయపరమైన ఆదేశాలను అమలు చేసే బాధ్యతను అప్పగించిన అధికారులు దానిని ఉద్దేశపూర్వకంగా ధిక్కరించడం రాజ్యాంగ విధిని ఘోరంగా ఉల్లంఘించడమేనని ధర్మాసనం పేర్కొంది. ఈ సంగతేంటో తేల్చాలని భావిస్తున్నట్లు ప్రకటించిన ధర్మాసనం.. కోర్టు గౌరవంతో పాటు న్యాయ పాలనలో స్వచ్ఛతను కాపాడేందుకు కూడా దీనిని పరిశీలించాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. ‘‘కోర్టు ఆదేశం రాష్ట్రానికి, దాని అధికారులకు వర్తిస్తుంది. ఈ కోర్టు ఆదేశాన్ని చర్చలకు ఆహ్వానంగా భావించవద్దు. మేం దానిని సవరించేంత వరకు రాష్ట్రాన్ని, అధికారులను, రాష్ట్ర చట్టం కింద పని చేస్తున్న ప్రతి శాసనబద్ధ లేదా మతపరమైన సంస్థ కట్టుబడి ఉండేలా చేస్తాం. ఎంతటి ఉన్నత స్థాయి వ్యక్తి అయినా సరే, న్యాయ ప్రవాహాన్ని కలుషితం చేయడానికి చేసే ఏ ప్రయత్నాన్నీ సహించబోమని ఈ ఆదేశం ద్వారా చెప్పదలచుకున్నాం’’ అని ధర్మాసనం విస్పష్టంగా ప్రకటించింది. తమిళనాడు డీజీపీ, హిందూ దేవదాయ శాఖ కార్యదర్శి, కమిషనర్‌, మదురై జిల్లా కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌, ఎస్పీ, ఆలయ అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.


vijay copy.jpgఇదిలా ఉండగా, తిరుప్పరంకుండ్రం కొండ వద్దకు శుక్రవారం రాత్రి సీఆర్‌పీఎఫ్‌ బలగాలు చేరుకోవడం ప్రారంభమైంది. కాగా, సుప్రీంకోర్టు తీర్పు విజయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని వీహెచ్‌పీ, హిందూమున్నని నేతలు పేర్కొన్నారు.

modi copy.jpg

మురుగన్‌కు హరోంహర!

సుప్రీం తీర్పుపై ప్రధాని మోదీ హర్షం!

తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న వివాదాస్పద ఏకశిలా స్తంభంపై కార్తీక దీపం వెలిగించే అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా హర్షం వ్యక్తం చేశారు. ‘వెట్రివేల్‌ మురుగన్‌కు హరోంహర.. ’’ అనే మాటను తమిళం, హిందీ, ఆంగ్లంలో రాసి తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. కానీ, సుప్రీం తీర్పు అంశాన్ని తన పోస్టులో ప్రస్తావించలేదు

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 03:34 AM