Share News

జ్యుడీషియల్ సర్వీస్‌కు ప్రాక్టీస్ ఏడాదే.. సుప్రీం కీలక నిర్ణయం

ABN , Publish Date - Aug 21 , 2026 | 01:29 PM

జ్యుడీషియల్ సర్వీస్‌లోకి ప్రవేశించడానికి ఉండాల్సిన న్యాయవాద వృత్తి అనుభవంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. మూడేళ్ల ప్రాక్టీస్‌ను ఏడాదికి కుదిస్తూ సుప్రీంకోర్టు సవరణ చేసింది.

జ్యుడీషియల్ సర్వీస్‌కు ప్రాక్టీస్ ఏడాదే.. సుప్రీం కీలక నిర్ణయం
legal practice requirement

ఇంటర్నెట్ డెస్క్: జ్యుడీషియల్ సర్వీసుల్లోకి నేరుగా ప్రవేశించాలనుకునే న్యాయ విద్యార్థులకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు మూడేళ్ల న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ నిబంధనను ఒక సంవత్సరానికి తగ్గించింది. మూడేళ్ల ప్రాక్టీస్ నిబంధనను తొలగించాలన్న అభ్యర్థనను పూర్తిగా తోసిపుచ్చనప్పటికీ, యువ న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని మార్పులు చేసింది.


సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఆగస్ట్ జార్జ్ మసీహ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఈ అంశంపై జస్టిస్ వినోద్ చంద్రన్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు కనీస అనుభవం ఉండాలన్న ప్రాథమిక ఉద్దేశాన్ని సమర్థిస్తూనే, నిబంధనలు కఠినంగా ఉండి యువ లా గ్రాడ్యుయేట్లకు ఇబ్బంది కలగకూడదని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.


ముఖ్యమైన మినహాయింపులు:

2025 మే 20 నుంచి 2027 మార్చి 31 మధ్య వెలువడే సివిల్ జడ్జి పరీక్షల నోటిఫికేషన్లకు హాజరయ్యే లా గ్రాడ్యుయేట్లకు ఎటువంటి ప్రాక్టీస్ అనుభవం లేకపోయినా దరఖాస్తు చేసుకునేందుకు సుప్రీంకోర్టు మినహాయింపునిచ్చింది. ఈ కాలంలో ఎంపికైన అభ్యర్థులు నేరుగా ట్రెయినీ జ్యుడీషియల్ ఆఫీసర్లుగా నియమితులవుతారు. అలానే వీరు స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో ఒక సంవత్సరం పాటు శిక్షణ పొందాలి.


ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు స్ట్రక్చర్డ్ లా క్లర్క్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మొదటి ఆరు నెలలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి లేదా హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్ సభ్యుల పర్యవేక్షణలో, తర్వాతి ఆరు నెలలు హైకోర్టు సిట్టింగ్ జడ్జిల పర్యవేక్షణలో క్లర్క్‌షిప్ పూర్తి చేయాలి. శిక్షణ కాలంలో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ స్థూల వేతనంలో సగానికి సమానమైన గౌరవ వేతనం అందుకుంటారు.


2027 ఏప్రిల్ 1 లేదా ఆ తర్వాత వెలువడే నోటిఫికేషన్ల ద్వారా సివిల్ జడ్జిలుగా ఎంపిక కావాలనుకునే అభ్యర్థులు కనీసం ఒక సంవత్సరం పాటు న్యాయవాద వృత్తి (Active Practice) అనుభవాన్ని కలిగి ఉండాలి. దీనిని ధ్రువీకరణ పత్రం ద్వారా సరిచూస్తారు. ఎంపికైన తర్వాత పైన పేర్కొన్న విధంగా ఒక సంవత్సరం అకాడమీ శిక్షణ, ఒక సంవత్సరం క్లర్క్‌షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ శిక్షణ కాలం పరిపూర్ణంగా ముగిసిన తర్వాతే వారు రెగ్యులర్ పోస్టుల్లో నియమితులై పూర్తి స్థాయి వేతనాన్ని అందుకుంటారు.


న్యాయ వ్యవస్థలో ప్రవేశించే ముందు అభ్యర్థులకు వృత్తిగత అనుభవం ఉండాలనే తలంపుతో పాటు, అకస్మాత్తుగా విధించిన కఠిన నిబంధనల వల్ల మహిళలు, దివ్యాంగులు, యువ లా గ్రాడ్యుయేట్లు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ మధ్యేమార్గాన్ని ఎంచుకున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి:

22 ఏళ్ల నాటి కేసు.. నిర్దోషిగా టీమిండియా మాజీ క్రికెటర్

ఫిఫా మహిళల ప్రపంచ కప్ 2027 షెడ్యూల్ విడుదల..

Updated Date - Aug 21 , 2026 | 02:21 PM