22 ఏళ్ల నాటి కేసు.. నిర్దోషిగా టీమిండియా మాజీ క్రికెటర్
ABN , Publish Date - Aug 21 , 2026 | 10:46 AM
22 ఏళ్ల క్రితం నమోదైన ఓ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ నిర్దోషిగా తేలాడు. అతడిపై వచ్చిన అభియోగాలకు సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్‌ను 22 ఏళ్ల క్రితం నమోదైన క్రిమినల్ కేసులో పాటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2004లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఐపీసీ సెక్షన్లు 420, 468, 471, 120బీ, పాస్‌పోర్ట్ చట్టం సెక్షన్ 12 కింద అతడిపై అభియోగాలు మోపబడ్డాయి. అయితే యూకే ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ఫోర్జరీ, ప్రయాణ ఏర్పాట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మార్టిన్‌పై వచ్చిన ఫిర్యాదులకు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు తేల్చిచెప్పింది. ఆర్థిక లావాదేవీలపై లేదా 'అజ్వా స్పోర్ట్స్ క్లబ్' యాజమాన్య నియంత్రణపై ఎటువంటి సరైన సాక్ష్యాలు లభించలేదని కోర్టు పేర్కొంది. పలువురు సాక్షులు కూడా ఈ ఆరోపణలను రుజువు చేయలేకపోవడంతో కోర్టు జాకబ్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది.
కోర్టు తీర్పు వెలువడిన అనంతరం జాకబ్ మార్టిన్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. 2004లో ఇంగ్లండ్‌లో ఆడేందుకు వెళ్లిన తన జట్టులోని ఒక ప్లేయర్ వీసా గడువు ముగిసినా యూకేలోనే ఉండిపోయాడని పేర్కొన్నాడు. తప్పుడు స్టాంపింగ్ చేయించుకుని భారత్‌కు తిరిగొచ్చే క్రమంలో ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డాడని జాకబ్ వివరించాడు. అసలు ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేకపోయినా, తానొక ఇంటర్నేషనల్ క్రికెటర్ కావడం వలనే విచారణ సమయంలో తన పేరును ఈ కేసులోకి బలవంతంగా చేర్చాని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ 22 ఏళ్ల సుదీర్ఘ కాలం తనను తీవ్రమైన మానసిక ఆందోళనకు గురిచేసిందని, చివరకు రైల్వే ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చిందని జాకబ్ మార్టిన్ వాపోయాడు. తనపై ఆరోపణలు వచ్చిన సమయంలో బీసీసీఐ నుంచి కూడా ఎటువంటి స్పందన లభించలేదని తెలిపాడు. ఏదేమైనా కోర్టు ఇచ్చిన ఈ తీర్పు తన జీవితానికి ఒక పెద్ద మలుపు అని, తనకు దక్కిన భారీ ఊరట అని జాకబ్ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా, కుడిచేతి వాటం బ్యాటర్ అయిన జాకబ్ మార్టిన్ భారత్ తరఫున 10 వన్డేలు ఆడి 22.57 సగటుతో 158 పరుగులు సాధించాడు.
ఇవి కూడా చదవండి:
ఫిఫా మహిళల ప్రపంచ కప్ 2027 షెడ్యూల్ విడుదల..
క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డును సమం చేసిన జో రూట్..