Share News

ఫిఫా మహిళల ప్రపంచ కప్ 2027 షెడ్యూల్ విడుదల..

ABN , Publish Date - Aug 21 , 2026 | 08:14 AM

2027లో జరగబోయే ఫిఫా మహిళల ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. గురువారం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఉన్న ఫిఫా ప్రధాన కార్యాలయంలో ఫిఫా ఈ షెడ్యూల్‌ను ప్రకటించింది.

ఫిఫా మహిళల ప్రపంచ కప్ 2027 షెడ్యూల్ విడుదల..
FIFA Women’s World Cup 2027

స్పోర్ట్స్ డెస్క్: ఇటీవలే అమెరికా వేదికగా జరిగిన ఫిఫా పురుషుల ప్రపంచ కప్2026 అభిమానులను ఎంతో అలరించింది. వివాదాలు, వినోదాలు, విచిత్ర ఘటనల మధ్య ఎంతో ఆసక్తిగా సాగిన ఈ టోర్నీలో స్పెయిన్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే ఫుట్ బాల్ ప్రియులకు మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. వచ్చే ఏడాది జరిగే ఫిఫా మహిళల ప్రపంచ కప్(FIFA Women's World Cup 2027) షెడ్యూల్ రిలీజ్ అయింది. బ్రెజిల్ వేదికగా జరిగే ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఫిఫా గురువారం విడుదల చేసింది.


స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఉన్న ఫిఫా ప్రధాన కార్యాలయంలో ప్లే-ఆఫ్ టోర్నమెంట్‌ ప్రిలిమినరీ దశ డ్రా సందర్భంగా ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు. దక్షిణ అమెరికా గడ్డపై తొలిసారిగా జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక మెగా టోర్నమెంట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రెజిల్‌లోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ టోర్నమెంట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీలో భాగంగా మొత్తం 64 మ్యాచులు జరగనున్నాయి. ఈ ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిస్తున్న బ్రెజిల్ జట్టు తన తొలి మ్యాచ్‌ను జూన్ 24న రియో డి జనీరోలోని ప్రఖ్యాత 'ఎస్టాడియో డో మరాకానా' (Estadio do Maracanã) స్టేడియంలో ఆడనుంది. జూలై 4న బ్రెసిలియాలోని చివరి గ్రూప్ మ్యాచ్‌ను బ్రెజిల్ ఆడుతుంది.


నాకౌట్ మ్యాచుల వేదికల వివరాలు:

రౌండ్ ఆఫ్ 16: బ్రెసిలియా, పోర్టో అలెగ్రే, రెస్సిఫె, సాల్వడార్ నగరాలు రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయి.

క్వార్టర్ ఫైనల్స్: ఈ దశకు బెలో హోరిజోంటే, ఫోర్టలేజా నగరాలతో పాటు రియో డి జనీరో, సౌపాలో వేదికలు కానున్నాయి.

సెమీఫైనల్స్ & ఫైనల్: సౌపాలలో ఒక సెమీఫైనల్, మూడో స్థానం కోసం పోటీ పడే మ్యాచ్ జరగనున్నాయి. మరొక సెమీఫైనల్, అలానే జూలై 25న జరిగే తుదిపోరు మరాకానా స్టేడియంలో జరగనున్నాయి.


చరిత్రలో పురుషుల ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు, మహిళల ప్రపంచకప్ ఫైనల్‌కు కూడా ఆతిథ్యం ఇచ్చిన మూడో స్టేడియంగా 'మరాకానా' అరుదైన ఘనతను సాధించనుంది. దీనికంటే ముందు స్వీడన్‌లోని సోల్నాలో ఉన్న రసుండా స్టేడియం (1958 పురుషుల, 1995 మహిళల ఫైనల్స్), అమెరికాలోని పసాడేనాలో ఉన్న రోజ్ బౌల్ (1994 పురుషుల, 1999 మహిళల ఫైనల్స్) మాత్రమే ఈ రికార్డును కలిగి ఉన్నాయి. అంతేకాకుండా, టోర్నమెంట్ జరిగే సమయంలో బ్రెజిల్ అంతటా 'ఫిఫా ఫ్యాన్ ఫెస్టివల్స్' నిర్వహించనున్నారు. దీనివల్ల అభిమానులు దేశవ్యాప్తంగా ఫుట్‌బాల్ పండుగను ప్రత్యక్షంగా ఆస్వాదించే అవకాశం లభిస్తుందని ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ ఫాంటినో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డును సమం చేసిన జో రూట్..

క్వార్టర్స్‌లో సాత్విక్‌, గాయత్రి జోడీలు

Updated Date - Aug 21 , 2026 | 09:40 AM