Share News

సీజేపీ సహ వ్యవస్థాపకుడు ఆశుతోశ్ రాంకా బృందంపై దాడి.. చొక్కా చింపి మరీ దాడి..

ABN , Publish Date - Aug 21 , 2026 | 01:26 PM

కాక్రోచ్ జనతా పార్టీ సహ వ్యవస్థాపకుడు అశుతోశ్ రాంకా బృందంపై దాడి జరిగింది. జైపూర్‌లోని రాంపురా కన్వర్‌పురాలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు సీజేపీ బృందం లక్ష్యంగా దాడి చేశారు. వారిపై రాళ్లతో దాడి చేసి, తీవ్రంగా కొట్టి గాయపరిచారు.

సీజేపీ సహ వ్యవస్థాపకుడు ఆశుతోశ్ రాంకా బృందంపై దాడి.. చొక్కా చింపి మరీ దాడి..
Attack on CJP

రాజస్థాన్: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సహ వ్యవస్థాపకుడు అశుతోశ్ రాంకా బృందంపై దాడి జరిగింది. జైపూర్‌లోని రాంపురా కన్వర్‌పురాలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు సీజేపీ బృందం లక్ష్యంగా దాడి చేశారు. వారిపై రాళ్లతో దాడి చేసి, తీవ్రంగా కొట్టి గాయపరిచారు. కార్యకర్తల కార్లు, ఫోన్లను కూడా దుండగులు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలను సందర్శించేందుకు వెళ్లగా ఈ దాడి జరిగింది.


గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు రాంపురా కన్వర్‌పురాకు అశుతోశ్ రాంకా తన బృందంతో వెళ్లారు. అయితే, కాలినడకన వారు గ్రామంలోకి ప్రవేశిస్తుండగా అప్పటికే అక్కడ వేచి ఉన్న కొంతమంది వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీజేపీకి వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు. అర్బన్ నక్సల్స్, దేశద్రోహులు, పాకిస్థానీలంటూ ఆరోపించారు. అయితే, సీజేపీ బృందంలోని మహిళలు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా ఆగ్రహంతో ఊగిపోయిన ఆ గుంపు.. కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. గ్రామంలోకి ప్రవేశించకుండా వెంటపడి మరీ తరిమికొట్టారు. రాళ్లు సైతం విసిరి తీవ్రంగా గాయపరిచారు.


ఈ ఘటన అనంతరం సీజేపీ సహ వ్యవస్థాపకుడు అశుతోశ్ రాంకా స్పందించారు. ఈ దాడికి బీజేపీయే కారణమని ఆరోపించారు. గోశాలలో పాఠశాలను నిర్వహిస్తున్నారని, తమ గ్రామానికి వచ్చి తనిఖీ చేయాలని స్థానికుల ఆహ్వానం మేరకే తాము వచ్చామని రాంకా పేర్కొన్నారు. ‘చాలా సంవత్సరాలుగా పాఠశాల ఓ గోశాలలో నడుస్తోంది. గతేడాదీ మేము ఇదే పాఠశాలను సందర్శించాం. ఈ రోజు పర్యటన గురించి పోలీసులకు ముందే తెలియజేశాం. కానీ బీజేపీ గూండాలు అప్పటికే అక్కడ ఉన్నారు. మా వాలంటీర్లపై దాడి చేశారు. మా కార్లు, ఫోన్లను ధ్వంసం చేశారు. ఓ మహిళపైనా దాడి చేశారు. నా చొక్కాను చింపేశారు. మా బృంద సభ్యుల్లో ఒకరి చేయి విరిగింది’ అని ఆరోపించారు.


ఓ స్థానిక బీజేపీ నేత బయట నుంచి తమపై దాడి చేసేందుకు గూండాలను పిలిపించారని రాంకా ఆరోపించారు. ఈ దాడితో గ్రామస్థులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘నేటి ఘటనకు గ్రామస్థులను నిందించవద్దని మీడియాను కోరుతున్నా. హింసను రెచ్చగొట్టడానికి బయటి నుంచి వ్యక్తులను పంపారు. పాఠశాలను వచ్చి తనిఖీ చేయమని మమ్మల్ని కోరింది గ్రామస్థులే. స్థానిక బీజేపీ కౌన్సిలర్ కొంతమంది గూండాలకు డబ్బులు పంచుతూ కనిపించారని పలువురు నాకు చెప్పారు’ అని రాంకా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


కాగా, సీజేపీ బృందంపై జరిగిన దాడి రాజస్థాన్ అసెంబ్లీలోనూ గందరగోళానికి దారితీసింది. ఈ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటసారా ఈ దాడికి బీజేపీయే కారణమని ఆరోపించగా.. రాజస్థాన్ హోంమంత్రి జవహర్ సింగ్ బేదం మాత్రం సీజేపీ ముసుగులో కాంగ్రెస్ పార్టీయే గొడవ సృష్టిస్తోందని పేర్కొన్నారు.

CJP2.jpg


ఈ వార్తలు కూడా చదవండి

భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. బయటకొచ్చిన వీడియో..

నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు: అభిజీత్ సంచలన ఆరోపణలు..

Updated Date - Aug 21 , 2026 | 01:47 PM