నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు: అభిజీత్ సంచలన ఆరోపణలు..
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:32 PM
స్కూల్ ఠీక్ కరో కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోని ఔసా జెడ్పీ పాఠశాలను సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి దాదా భూసేను రాజీనామా చేయాలని దీప్కే డిమాండ్ చేశారు.
లాతూర్: నీట్-యూజీ పేపర్ లీక్ నిరసనల అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఫోకస్ పెట్టింది. సీజేపీ కార్యకర్తలంతా ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమం కింద తమతమ ప్రాంతాల్లోని పాఠశాలలను సందర్శించి అక్కడి పరిస్థితులను ఆరా తీస్తున్నారు. నిర్వహణ సరిగా లేని స్కూళ్ల వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల గురించి తెలుసుకునేందుకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా గ్రామాల బాట పట్టారు. లాతూర్ జిల్లా ఔసా జెడ్పీ పాఠశాలను సందర్శించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిన్న (గురువారం) ఔసా జెడ్పీ పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణ మొత్తం కలియతిరిగారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన పథకం వంటివి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనిఖీ సమయంలో తరగతి గదుల్లో ఉన్న కొందరు విద్యార్థులు ఆ పాఠశాలకు చెందిన వారు కాదని అభిజిత్ ఆరోపించారు. తనను చూసి ఇతర పాఠశాలల నుంచి విద్యార్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టినట్లు పేర్కొన్నారు. పాఠశాల రికార్డుల్లో పేర్లు లేని పిల్లలు అక్కడ ఎందుకు ఉన్నారని ఉపాధ్యాయులను తాను ప్రశ్నించినట్లు దీప్కే తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను పాఠశాల ప్రిన్సిపల్ బాలాజీ గవాలీ ఖండించారు. ఒకే భవనంలో మరాఠీ, ఉర్దూ మాధ్యమాలకు చెందిన రెండు పాఠశాలలు కొనసాగుతున్నాయని, అక్కడ కనిపించిన పిల్లలు తమ విద్యార్థులేనని స్పష్టం చేశారు.
మరోవైపు, పాఠశాల ఆవరణలో మద్యం సీసాలు కనిపించాయని దీప్కే ఆరోపించారు. తాగునీటి వంటి కనీస సదుపాయాలూ సరిగా లేవని పేర్కొన్నారు. తనిఖీకి కొద్దిసేపటి ముందే మరుగుదొడ్లను శుభ్రం చేసినట్లు చెప్పుకొచ్చారు. పాఠశాలల నిర్వహణను పర్యవేక్షించే విద్యాశాఖ అధికారులు దీనికి బాధ్యత వహించాలని, నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే లాతూర్ జిల్లాలోని పాఠశాలల్లో సామాజిక ఆడిట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, దీప్కే ఆరోపణలపై మహారాష్ట్ర విద్యాశాఖ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. బయటకొచ్చిన వీడియో..
పాక్ కాదు.. చైనానే.. భారత ఆర్మీ మాజీ చీఫ్ నరవణే కీలక వ్యాఖ్యలు