ప్రజల్ని చీమలతో పోల్చేవారు జడ్జీలవుతున్నారు!
ABN , Publish Date - Aug 02 , 2026 | 07:42 AM
న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులకు సంబంధించి కొలీజియం అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్జీలుగా నియమిస్తున్న వ్యక్తులను ఎందుకు ఎంపిక చేశామన్న కారణాలను కొలీజియం వెల్లడించటం లేదని, దీనివల్ల న్యాయ వ్యవస్థకు తగని వ్యక్తులు ఆ రంగంలోకి ప్రవేశిస్తున్నారని తెలిపారు.
రాజ్యాంగ విలువలకు పూర్తి
వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు
జడ్జీల నియామకాల తీరు సరిగా లేదు
ఎంపిక కారణాలను పేర్కొనటం లేదు
దీంతో అసమర్థులు ప్రవేశిస్తున్నారు
ప్రతిభావంతులకు అన్యాయం
కొలీజియం వైఖరి పారదర్శకతకు వ్యతిరేకం
దీనిని మార్చుకోవాలి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులకు సంబంధించి కొలీజియం అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్జీలుగా నియమిస్తున్న వ్యక్తులను ఎందుకు ఎంపిక చేశామన్న కారణాలను కొలీజియం వెల్లడించటం లేదని, దీనివల్ల న్యాయ వ్యవస్థకు తగని వ్యక్తులు ఆ రంగంలోకి ప్రవేశిస్తున్నారని తెలిపారు. ఇలాంటివాళ్లే ప్రజాసమూహాల్ని చీమలుగా అభివర్ణిస్తూ.. రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన, పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు.
న్యాయ మేధోసంస్థ ‘విధి’ శనివారం ‘న్యాయవ్యవస్థలో పారదర్శకత’ అన్న అంశంపై నిర్వహించిన ఓ సదస్సులో జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రసంగించారు. ‘జడ్జీల పదోన్నతులు, బదిలీలకు సంబంధించి (కొలీజియంలో) జరిగే చర్చలు పూర్తిగా రహస్యంగా ఉంటున్నాయి. ఒక సిఫార్సును తిరస్కరిస్తే దానికి గల కారణాలను అరుదుగా తప్ప బయటకు పూర్తిగా వెల్లడించటం లేదు. నియామకాలు, పదోన్నతులు, బదిలీలకు అనుసరిస్తున్న ప్రమాణాలను నిర్దిష్టంగా పేర్కొని ప్రజలకు అందుబాటులో ఉంచటం లేదు. కొలీజియం చేసిన గత మూడు తీర్మానాల్లోనూ.. ఆ నిర్ణయాలకు గల కారణాలను వెల్లడించలేదు’ అని తెలిపారు. ఇంతకు ముందటి కొలీజియం తీర్మానాల్లో.. ఏవో కొన్ని కారణాలనైనా పేర్కొనేవారని, ఇప్పుడు అదీ కనిపించటం లేదని చెప్పారు.
కోర్టుల్లో ఏం జరుగుతోంది? తమ న్యాయమూర్తులు ఎటువంటి వారు? అన్న వివరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ స్పష్టం చేశారు. కొలీజియం తీరు పారదర్శకత నుంచి వెనక్కి మళ్లినట్లు కాదా? అని ప్రశ్నించారు. దీనివల్ల న్యాయవ్యవస్థకు, ప్రజాప్రయోజనాలకు అపారమైన నష్టం జరుగుతోందని, ఓవైపు రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వ్యక్తులు జడ్జీలుగా ప్రవేశిస్తున్నారని, మరోవైపు అద్భుతమైన ప్రతిభా సామర్థ్యాలతో గొప్ప కృషి చేస్తున్న జడ్జీలకు పదోన్నతి లభించక అన్యాయం జరుగుతోందన్నారు.
ఇటీవలి కాలంలో ఓ హైకోర్టు జడ్జి ఇటువంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఇటువంటి వారిని నిలువరించటానికి (కొలీజియంలో) చర్చ జరగాలని, నియామకాలకు కారణాలు వెల్లడించాలని పేర్కొన్నారు. సదరు జడ్జి ఎవరన్నది జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వెల్లడించకపోయినా.. 2024లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు జడ్జిని ఉద్దేశించే ఆయన ఇలా మాట్లాడి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వీహెచ్‌పీ నిర్వహించిన ఓ సభలో ఆ హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘భారతీయ సంస్కృతిలో చీమలకు కూడా హాని తలపెట్టవద్దని చెబుతూ పిల్లలను పెంచుతాం. దీనివల్లే మనం సహనంతో ఉంటాం. ఇతరుల బాధల పట్ల మానవీయంగా స్పందిస్తాం. కానీ, కొన్ని సంస్కృతుల్లో పిల్లలు చిన్నప్పటి నుంచే పశువులను వధించటం చూస్తూ పెరుగుతారు. వారికి సహనం ఎలా అలవడుతుంది?’ అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలను ముస్లింలను ఉద్దేశించి చేశారంటూ, ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇలా ఎలా మాట్లాడుతారంటూ అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగులను బొద్దింకలతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీజేపీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
బెంగాల్ ఉగ్ర మోడ్యూల్ గుట్టురట్టు.. జంతర్ మంతర్ ధర్నాలో దాడికి ఉగ్రవాది కుట్ర!
For More National News And Telugu News