ఈ దఫా డీలిమిటేషన్ లేనట్టే?
ABN , Publish Date - Aug 02 , 2026 | 07:36 AM
కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు సమాచారం.
ప్రస్తుత సమావేశాల వరకు ‘మహిళా బిల్లు’ను పక్కనపెట్టాలని నిర్ణయం!
జెన్‌జీ ఉద్యమం నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితులే కారణం
వచ్చే వారం ఎజెండాలో ఈ బిల్లులు లేవన్న అధికార వర్గాలు
ఇతర బిల్లులు ఆమోదింపజేసుకొని నిరవధికంగా వాయిదా వేసే చాన్స్
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు సమాచారం. రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం భావిస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్రం తొలుత భావించింది.
బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో కుదేలైన తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన ఎంపీలు ఎన్‌డీఏకు మద్దతు పలకటం, శివసేన (ఉద్ధవ్)కు చెందిన పలువురు ఎంపీలు కూడా ఇదే బాటన ఏక్‌నాథ్ శిందే శివసేనలో చేరటం, ఇండియా కూటమి కీలక నేత శరద్‌పవార్‌తో ప్రధాని మోదీ ఇటీవల భేటీ కావటం వంటి పరిణామాలు.. ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన బలాన్ని ఎన్‌డీఏ సమకూర్చుకుంటుందన్న వాతావరణాన్ని సృష్టించాయి.
కానీ, అనూహ్యంగా ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సారథ్యంలో జరిగిన జెన్‌జీ ఉద్యమం, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామాతో కేంద్రం అంచనాలు తప్పాయి. ఢిల్లీలో విద్యార్థుల మీద పోలీసుల లాఠీచార్జి, పెల్లెట్ల ప్రయోగం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని పార్లమెంటులో విపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ముందుకు తీసుకెళ్లటం కష్టమని, ప్రస్తుతానికి పక్కనపెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే వారం కూడా పార్లమెంటు ఎజెండాలో ఈ బిల్లులు లేవని అధికార వర్గాలు వెల్లడించాయి.
వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్, ఎఫ్‌సీఆర్‌ఐ బిల్లులను కూడా ప్రభుత్వం వాయిదా వేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వీలైనంత త్వరలో ఇతర బిల్లులను ఆమోదింపజేసుకొని సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచే బిల్లు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ బిల్లు, బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ బిల్లు, ఆదాయపన్ను చట్టానికి సంబంఽధించిన బిల్లు మొదలైన వాటిని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజల్ని చీమలతో పోల్చేవారు జడ్జీలవుతున్నారు!
బెంగాల్ ఉగ్ర మోడ్యూల్ గుట్టురట్టు.. జంతర్ మంతర్ ధర్నాలో దాడికి ఉగ్రవాది కుట్ర!
For More National News And Telugu News