ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ఎరుపు రంగు హెచ్చరిక గుర్తులు.. ఎఫ్ఎస్ఎస్ఏఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ABN , Publish Date - Nov 26 , 2026 | 03:49 PM
కొవ్వులు, ఉప్పు, చక్కెర అధిక స్థాయిలో ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్ ఉత్పత్తులపై వార్నింగ్ లేబుళ్లును తప్పనిసరిగా ఉంచాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)కు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: కొవ్వులు, ఉప్పు, చక్కెర అధిక స్థాయిలో ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్ ఉత్పత్తులపై వార్నింగ్ లేబుళ్లును తప్పనిసరిగా ఉంచాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)కు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అలాంటి ఆహార ఉత్పత్తులపై స్పష్టమైన హెచ్చరిక చిహ్నాలు ఉండితీరాలని తేల్చిచెప్పింది. ఆహారంలో సాల్ట్, షుగర్, ఫ్యాట్ ఎక్కువ మోతాదులో ఉన్నాయని వినియోగదారుడికి తెలిసేలా ప్యాకెట్ ముందు భాగంలో హెక్సాగాన్ ఆకారంలో ఎరుపు రంగు గుర్తులను ముద్రించాలని ఆదేశించింది. ఇలా చేయడం వల్ల అనారోగ్యకర ఆహార పదార్థాలను కొనుగోలుదారులు గుర్తిస్తారని జస్టిస్ పార్థీవాలా, జస్టిస్ కె.వినోద్‌తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
కొవ్వులు, ఉప్పు, చక్కెర.. ఈ మూడింటికీ వేర్వేరు హెచ్చరిక చిహ్నాలు ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ చిహ్నాలను ఎరుపు రంగు హెక్సాగాన్ ఆకారం మధ్యలో ప్రదర్శించాలని తెలిపింది. ఉదాహరణకు ఒక ఆహార పదార్థంలో పై మూడూ అధికంగా ఉన్నాయని అనుకుందాం. అప్పుడు ఆ ప్యాకెట్‌పైన సాల్ట్, షుగర్, ఫ్యాట్‌కు సంబంధించిన మూడు వేరు వేరు హెచ్చరిక చిహ్నాలు ఉండాలి. అదే ఒకవేళ చక్కెర మాత్రమే ఎక్కువగా ఉంటే.. ఒక వార్నింగ్ సింబలే ఉంటుంది. ఈ విధానం ద్వారా కొనుగోలు చేస్తున్న ప్యాకేజ్డ్ ఫుడ్ ఉత్పత్తులపై వినియోగదారులకు పూర్తి అవగాహన ఏర్పడుతుందని ‘సుప్రీం’ భావిస్తోంది.
కాగా ఇటీవలి కాలంలో ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వార్నింగ్ లేబుళ్లును సర్వోన్నత న్యాయస్థానం తప్పనిసరి చేసింది. ప్యాకేజ్డ్ ఫుడ్‌కు సంబంధించిన నిబంధనలను కఠినతరంగా మార్చింది. FSSAIకు పలు ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలూ చదవండి
జ్యుడీషియల్ మెంబర్ తప్పనిసరి.. ఈడీ ఆస్తుల జప్తుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. ముంబైలో మరిన్ని ప్రాంతాలకు హెచ్చరిక..