మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై కేసును మూసేసిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Jul 29 , 2026 | 01:58 PM
బొగ్గు గనుల కేటాయింపుల కేసులో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఉన్న క్రిమినల్ కేసును, సమన్ల ఉత్తర్వును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రత్యేక కోర్టు గతంలో జారీ చేసిన సమన్ల ఉత్తర్వులను కొట్టివేస్తూ కేసును శాశ్వతంగా క్లోజ్ చేసింది.
ఢిల్లీ, జులై 29: బొగ్గు గనుల కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఉన్న క్రిమినల్ కేసును, ఆయనకు జారీ చేసిన సమన్ల ఉత్తర్వును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రత్యేక కోర్టు గతంలో జారీ చేసిన సమన్ల ఉత్తర్వులను కొట్టివేస్తూ కేసును శాశ్వతంగా క్లోజ్ చేసింది.
చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు ఇతరులకు విచారణ సంస్థ క్లీన్ చిట్ ఇస్తూ సమర్పించిన క్లోజర్ నివేదికలను సుప్రీంకోర్టు ఆమోదించింది. సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టులను తోసిపుచ్చి, ట్రయల్ కోర్టు మన్మోహన్ సింగ్‌కు సమన్లు జారీ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
'విచారణ సంస్థల నివేదికల స్వీకరణపై ఈ కోర్టు గతంలో వెలువరించిన మార్గదర్శకాల ఆధారంగా చూస్తే, సీబీఐ అందించిన క్లోజర్ రిపోర్టులను తోసిపుచ్చి స్పెషల్ జడ్జి కేసును విచారణకు స్వీకరించడానికి ఎటువంటి బలమైన కారణం కనిపించడం లేదు. అందుకే మేము ఈ అప్పీల్‌ను అనుమతిస్తూ కేసును క్లోజ్ చేస్తున్నాం' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కేసు నేపథ్యం (2005 తలబిరా-II బొగ్గు గని కేటాయింపు)
2005లో ఒడిశాలోని తలబిరా-II (Talabira-II) బొగ్గు బ్లాక్ కేటాయింపుల వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి పి.సి. పరాఖ్‌లతో పాటు మరొక ముగ్గురిని నిందితులుగా పేర్కొంటూ నాటి ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.
అయితే, ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని సమన్లపై స్టే విధించింది. ప్రధానమంత్రిగా, పబ్లిక్ సర్వెంట్‌గా నిర్ణయం తీసుకున్నందున చట్టపరమైన అనుమతి లేకుండా ప్రాసిక్యూట్ చేయడం సరికాదంది. కాగా, ఈ కేటాయింపుల ప్రక్రియలో ఎలాంటి నేరపూరిత ఉద్దేశం లేదని మన్మోహన్ సింగ్ ఆనాడే సుప్రీంకోర్టులో స్పష్టం చేశారు. ఇక, సుదీర్ఘ కాలం సాగిన ఈ విచారణలో సీబీఐ రెండుసార్లు దాఖలు చేసిన క్లోజర్ నివేదికలను ఆమోదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఉన్న ప్రధాన ఆరోపణలు తొలగిపోయినట్లయింది.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
బొండా ఉమా వివరణతో సంతృప్తి చెందిన అధిష్ఠానం
Read Latest AP News And Telangana News And International News And Telugu News