ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..
ABN , Publish Date - Jan 31 , 2026 | 08:07 PM
సునేత్ర పవార్‌కు ఎక్సైజ్ శాఖ, క్రీడలు-యువజన సంక్షేమం, మైనారిటీల అభివృద్ధి శాఖలను దేవేంద్ర ఫడ్నవిస్ 'మహాయుతి' ప్రభుత్వం కేటాయించింది..
ముంబై: మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా దివంగత అజిత్ పవార్ భార్య, ఎన్‌సీపీ రాజ్యసభ సభ్యురాలు సునేత్రా పవార్ శనివారంనాడు పగ్గాలు చేపట్టారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు. అజిత్ పవార్ మరణంతో ఎన్‌సీపీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా సునేత్ర శనివారం ఉదయం ఎన్నికయ్యారు. ఆ వెంటనే సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ఉప ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణస్వీకారం చేశారు. 'మహాయుతి' సర్కార్‌లో అజిత్ పవార్ నిర్వహించిన మూడు శాఖలను ఆమెకు కేటాయించారు.
ఎక్సైజ్ శాఖ, క్రీడలు-యువజన సంక్షేమం, మైనారిటీల అభివృద్ధి శాఖలను సునేత్రకు ఫడ్నవిస్ ప్రభుత్వం కేటాయించింది. అయితే అజిత్ పవార్ చేతిలోని మరో కీలకమైన ఆర్థిక శాఖను మాత్రం కేటాయించలేదు. మహారాష్ట్ర బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన చేతిలోనే ఉంచుకున్నారు. దీంతో ఆయనే స్వయంగా ఈసారి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఆ తర్వాతే ఎన్‌సీపీకి ఆర్థిక శాఖను కేటాయించడం కానీ, దానికి బదులుగా మరో శాఖను కానీ కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
పవార్‌ను కలిసిన అజిత్ తనయుడు
మరోవైపు, సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే విషయం తనకు తెలియదని, వార్తలు చూసిన తర్వాతే ఆ విషయం తనకు తెలిసిందని ఎన్‌సీపీ ఎన్‌పీ చీఫ్ శరద్ పవార్ శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఎన్‌సీపీ-ఎన్‌సీపీఎస్‌పీ విలీనాన్ని అజిత్ పవార్ కోరుకున్నట్టు కూడా తెలిపారు. దురదృష్టవశాత్తూ విమాన ప్రమాదంతో ఆ చర్చలు ఆగిపోయాయన్నారు. కాగా, శరద్ పవార్ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే ఆయనను అజిత్ పవార్ తనయుడు పార్థ్ పవార్, ఎన్‌సీపీ(ఎస్‌పీ) ఎమ్మెల్యే రోహిత్ కలుసుకున్నారు. తాజా పరిణామాలను ఆయనకు వివరించారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్
ఎన్‌సీపీ శాసనసభాపక్ష నేతగా సునేత్ర పవార్ ఎన్నిక
For More National News And Telugu News