వయనాడ్‌లో 150 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన 38 మంది
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:51 PM
కేరళంలోని వయనాడ్ జిల్లాలో ఒక పాఠశాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజులుగా జ్వరం, వాంతులు బారిన పడటంతో 38 మందిని సుల్తాన్ బత్తేరి తాలూక్ ఆసుపత్రిలో చేర్చారు.
తిరువనంతపురం: కేరళంలోని వయనాడ్ జిల్లాలో ఒక పాఠశాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజులుగా జ్వరం, వాంతులు బారిన పడటంతో 38 మందిని సుల్తాన్ బత్తేరి తాలూక్ ఆసుపత్రిలో చేర్చారు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
మార్ బాసిలియోస్ ఎయిడెడ్ అప్పర్ ప్రైమరీ స్కూలులో చదువుతున్న విద్యా్ర్థుల్లో గత మూడు రోజులుగా జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనపిస్తున్నాయని, వ్యాధికి కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి వ్యాధి మరింత విస్తరించకుండా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.
కాగా, పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అధికారులు ముందస్తు చర్యగా పాఠశాలకు వారం రోజులు సెలవు ప్రకటించారు. దీనిపై జిల్లా వైద్య అధికారి మాట్లాడుతూ, విద్యార్థుల తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు ఆందోళన చెందవద్దని, పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. విద్యార్థుల్లో ఎక్కువ మంది చికిత్సకు స్పందిస్తున్నారని, పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. విద్యార్థుల శాంపిల్స్ సేకరించి లాబొరేటరీకి పంపినట్టు చెప్పారు. ఆహారం, తాగునీటి కారణంగా వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకిందా, ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనేది పరీక్షల్లో నిర్ధారణవుతుందని తెలిపారు. పంచాయతీ ప్రతినిధులు కూడా ఆసుపత్రిని సందర్శించారు. విద్యార్థుల పరిస్థితి సంతృప్తికరంగానే ఉందని, ఆరోగ్యం బాగా క్షీణిస్తున్న లక్షణాలేవీ లేవని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో.. ముగిసిన సీజేపీ నిరసన
రామలింగారెడ్డి రాజీనామా సమస్య పరిష్కారమైంది.. డీకే