ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో.. ముగిసిన సీజేపీ నిరసన
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:13 PM
ప్రవేశ పరీక్షలు, రిక్రూట్మెంట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను పరిష్కరించేందుకు ప్రస్తుత విద్యా వ్యవస్థలో సంస్కరించాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ: ప్రవేశ పరీక్షలు, రిక్రూట్మెంట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను పరిష్కరించేందుకు ప్రస్తుత విద్యా వ్యవస్థను సంస్కరించాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) డిమాండ్ చేసింది. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ శనివారంనాడు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈ నిరసనలకు నాయకత్వం వహించగా, ప్రముఖ విద్యావేత్త, యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్, పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది సుదీర్ఘ పోరాటమని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ ఆరంభం మాత్రమేనని సీజేపీ స్పష్టం చేసింది.
ఇంకెందరు బలికావాలి?
సీజేపీ మద్దతుదారులను ఉద్దేశించి అభిజీత్ దీప్కే మాట్లాడుతూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ నిరసనలు కొనసాగుతాయని ప్రకటించారు. ఇంకెంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేంత వరకూ అధికారులు వేచిచూస్తారని నిలదీశారు. తమ డిమాండ్ల నెరవేరేంత వరకూ ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు. నిరసనలకు దిగితే జైలులో పెడతారేమోనని తన తల్లి భయపడినట్టు దీప్కే చెప్పారు. 'తమ పిల్లలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే ఏమవుతుందోనన్న భయం ఈ దేశంలోని ప్రతి తల్లికి ఉంది. ఈ ప్రభుత్వానికి భయపడి ఎంతకాలం బతకాలి?' అని ఆయన ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని నెలరోజుల నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ చర్చలు తీసుకోవడం లేదని, దీనికి బదులు ఇతర అంశాలపైనే వాళ్లు దృష్టి పెట్టారని అన్నారు. సీజేపీ అకౌంట్లు హ్యాక్ చేయడం, పోస్టులు డిలీట్ చేయడం చేస్తున్నారని చెప్పారు. పోస్టులను డీలీట్ చేయవచ్చు కానీ, తమను ఏమార్చలేరని అన్నారు. పేపర్ లీక్‌లు, విద్యావ్యవస్థలో తప్పిదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల పేర్లను ఆయన చదవి వినిపించారు. విద్యార్థుల మృతికి సీజేపీ సంతాపం ప్రకటించింది. జంతర్‌మంతర్ నిరసనల్లో పాల్గొనేందుకు ఆయన అమెరికాలోని బోస్టన్ నుంచి ఢిల్లీకి వచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్రను చేత్తో పట్టుకుని కనిపించారు.
విద్యాశాఖను వాంగ్‌చుక్ చేపట్టాలి..
జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉండాలని కోరారు. అయితే తనకు రాజకీయాల్లో ప్రవేశించాలే ఆలోచన లేదని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. యువకులే ఆ బాధ్యత చేపట్టాలన్నారు. రాజకీయవేత్తలు, ప్రభుత్వ అధికారుల పిల్లలు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదవాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. సీజేపీ నిరసనలకు ప్రభుత్వం అనుమతించాన్ని ఆయన స్వాగతించారు. నిరసన తెలపడం తనకు ఇష్టం లేకున్నా న్యాయం కోసమే ఆ పని చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థలో మార్పు జరగాలని అన్నారు. కాగా, తదుపరి నిరసన ప్రదర్శనను జూన్ 23న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించే ఆలోచనలో సీజేపీ ఉంది.
ఇవి కూడా చదవండి..
రామలింగారెడ్డి రాజీనామా సమస్య పరిష్కారమైంది.. డీకే
తమిళనాట బీజేపీకి వరుస షాక్‌లు.. సుమతి వెంకటేశ్ రాజీనామా