తమిళనాట బీజేపీకి వరుస షాక్‌లు.. సుమతి వెంకటేశ్ రాజీనామా
ABN , Publish Date - Jun 06 , 2026 | 01:34 PM
తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే అన్నామలై, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్ పార్టీని వీడిన కొన్ని రోజుల్లోనే, మరో కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేశ్ ఇవాళ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
చెన్నై, జూన్ 6: తమిళనాడు భారతీయ జనతా పార్టీలో (TN BJP) సంక్షోభం మరింత ముదురుతోంది. ఆ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే అన్నామలై, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్ పార్టీని వీడిన కొన్ని రోజుల్లోనే, మరో కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి (State Secretary) సుమతి వెంకటేశ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన భావోద్వేగ లేఖను పంచుకున్నారు. భారమైన హృదయంతో తప్పుకుంటున్నానని.. చాలా రోజులు ఆలోచించిన తర్వాతే తానీ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు సుమతి వెంకటేశ్ తెలిపారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తూ, పార్టీతో తన అనుబంధాన్ని ముగిస్తున్నానని ఆమె తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బీజేపీలో పనిచేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కూడా సుమతి అన్నారు.
అయితే, పార్టీ వీడినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, జాతీయవాదం, దేశభక్తి సిద్ధాంతాలు తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని సుమతి వెంకటేశ్ స్పష్టం చేశారు. తన పదవీ కాలంలో సహకరించిన జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు, కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
అన్నామలై బాటలోనే..
తమిళనాడులో బీజేపీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లిన కే అన్నామలై ఇటీవల పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వంశపారంపర్య రాజకీయాలు, వ్యక్తిగత ఆరాధనలకు దూరంగా, సాధారణ ప్రజల రాజకీయం తీసుకురావడమే లక్ష్యంగా తాను సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నామలై దారిలోనే మిగిలిన కీలక నేతలు కూడా నడుస్తుండటం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వార్తలు కూడా చదవండి
ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న అభిజీత్ దీప్కే.. వీడియో వైరల్..
జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉపసంహరణ.. లాలూ ఇంటి ముందు కార్యకర్తల కాపలా..