Share News

రామలింగారెడ్డి రాజీనామా సమస్య పరిష్కారమైంది.. డీకే

ABN , Publish Date - Jun 06 , 2026 | 02:57 PM

కోరుకున్న శాఖను ఇవ్వలేదంటూ మంత్రి పదవికి సీనియర్ నేత రామలింగా రెడ్డి రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. అసంతృప్తి నేతతో చర్చలు జరిపారు. అనంతరం సమస్య పరిష్కారమైనట్టు మీడియాకు వెల్లడించారు.

రామలింగారెడ్డి రాజీనామా సమస్య పరిష్కారమైంది.. డీకే
Ramalinga Reddy, DK Shivakumar

బెంగళూరు: కోరుకున్న శాఖను ఇవ్వలేదంటూ మంత్రి పదవికి సీనియర్ నేత రామలింగా రెడ్డి రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. అసంతృప్తి నేతతో చర్చలు జరిపారు. అనంతరం సమస్య పరిష్కారమైనట్టు మీడియాకు వెల్లడించారు. జయనగర్‌లోని ఒక ప్రైవేటు హోటల్‌లో శుక్రవారం రాత్రి రామలింగారెడ్డితో డీకే చర్చలు జరిపారు. కాంగ్రెస్ సీనియర్ మంత్రలు, రెడ్డి సన్నిహితులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.


'ఇది కుటుంబ వ్యవహారం. కలిసి కూర్చుకుని మాట్లాడుకున్నాం. సమస్య సద్దుమణిగింది. ఆయన తనకున్న ఇబ్బంది ఏమిటో చెప్పారు. సమాచార లోపం వల్లే ఇలాంటివి ఒక్కోసారి జరుగుతుంటాయి. వాటిని మేము పరిష్కరించుకుంటాం. అంతా సజావుగానే ఉంది. మేము సీనియర్లందరికీ అవకాశాలు కల్పిస్తాం. అన్ని వ్యవహారాలు చక్కబెడతాం' అని డీకే తెలిపారు. 1980 నుంచి తామిద్దరం మంచి మిత్రులమనీ, ప్రస్తుతం తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ గతంలో తాము మంత్రులమని, కలిసి పనిచేశామని చెప్పారు.


బెంగళూరు అర్బన్ డవలప్‌మెంట్(జీబీఏ) శాఖకు బదులు జలవనరుల శాఖను తనకు కేటాయించడంపై రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన పదవికి శుక్రవారంనాడు రాజీనామా చేసారు. తనకు మాట ఇచ్చి తప్పారంటూ మీడియా ముందే ఆయన తన రాజీనామా పత్రంపై సంతకం చేశారు. ఎమ్మెల్యేగా కొనసాగుతానని చెప్పారు. తన సహచరుడి ద్వారా రాజీనామా పత్రాన్ని డీకేకు పంపారు. అయితే ముఖ్యమంత్రి ఆయన రాజీనామాను అంగీకరించలేదు. సిద్ధరామయ్య సన్నిహితుడిగా రామలింగారెడ్డిని చెబుతారు. రామలింగారెడ్డి రాజీనామాతో కర్ణాటకలో సిద్ధరామయ్య పట్టు కొనసాగుతోందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. రెడ్డి రాజీనామాను అంగీకరిస్తే మరికొంత మంది కూడా తమ డిమాండ్లతో ముందుకు రావచ్చని డీకే భావిస్తున్నారని, మంత్రి రాజీనామాను తిరస్కరించడం ద్వారా ఆదిలోనే అసంతృప్తులకు అడ్డుకట్టు వేయాలనే నిర్ణయం తీసుకున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

తమిళనాట బీజేపీకి వరుస షాక్‌లు.. సుమతి వెంకటేశ్ రాజీనామా

జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉపసంహరణ.. లాలూ ఇంటి ముందు కార్యకర్తల కాపలా..

Updated Date - Jun 06 , 2026 | 03:18 PM