Share News

నేడు స్టాలిన్, పవార్‌లతో సోనియా, రాహుల్, ఖర్గే భేటీ.. కూటమిని కాపాడేందుకు ఆఖరి ప్రయత్నం

ABN , Publish Date - Nov 29 , 2026 | 11:07 AM

ఇండియా కూటమిలో ఏర్పడిన విభేదాలను చక్కదిద్దేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. నేడు స్టాలిన్, శరద్ పవార్‌లతో కీలక భేటీలు జరుపబోతున్నారు.

నేడు స్టాలిన్, పవార్‌లతో సోనియా, రాహుల్, ఖర్గే భేటీ.. కూటమిని కాపాడేందుకు ఆఖరి ప్రయత్నం
Congress Meetings Today

ఢిల్లీ, నవంబర్ 29: డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లు విషయంలో ఇండియా (INDIA) కూటమిలో ఏర్పడిన విభేదాలను చక్కదిద్ది, విపక్ష ఐక్యతను కాపాడేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. రేపు (నవంబర్ 30)న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇవాళ (ఆదివారం) కీలక మిత్రపక్ష నేతలు ఎం.కె. స్టాలిన్, శరద్ పవార్‌లతో వేర్వేరుగా భేటీ కానున్నారు.

చెన్నైలో స్టాలిన్‌తో, ముంబైలో పవార్‌తో మంతనాలు

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించిన డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌ను కలిసేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు చెన్నై వెళ్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్‌తో ఇవాళ రాత్రి 8 గంటల ప్రాంతంలో ముంబైలోని బ్రీచ్ క్యాండీలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ సమావేశం కానున్నారు.

విపక్ష కూటమిలో సమన్వయం కోసం ఆఖరి ప్రయత్నం

నిన్న (శనివారం) ఢిల్లీలోని ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి ఎన్సీపీ (ఎస్పీ) దూరంగా ఉండగా, డీఎంకే ఇప్పటికే సవరించిన డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలిపింది. అంతేకాకుండా, లోక్‌సభలో తమ ఎంపీలంతా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని ఎన్సీపీ (ఎస్పీ) ఇప్పటికే విప్ (Whip) జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, పార్లమెంటు సమావేశాలకు ఒకరోజు ముందే ఆ రెండు పార్టీల అధినేతలతో నేరుగా చర్చించి కూటమిలో ఉమ్మడి వ్యూహాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

కాంగ్రెస్ ప్రధాన అభ్యంతరం ఏంటి?

ప్రస్తుత 543 సీట్ల ప్రాతిపదికనే మహిళలకు 33శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని, దానిని సీట్ల పెంపు (850 సీట్లు)డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టవద్దని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. (Congress Meetings Today)


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

Updated Date - Nov 29 , 2026 | 11:17 AM