ఈ వారంలోనే సిద్ధరామయ్య రాజీనామా! రాజ్యసభకు పంపే అవకాశం
ABN , Publish Date - May 26 , 2026 | 08:47 PM
కర్ణాటకలో నాయకత్వ పోరుకు తెరపడనున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు అధిష్టానం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసి కేంద్రంలో కీలక పాత్ర పోషించాల్సిందిగా కోరిందని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: కర్ణాటకలో నాయకత్వ పోరుకు తెరపడనున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు అధిష్టానం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసి కేంద్రంలో కీలక పాత్ర పోషించాల్సిందిగా కోరిందని తెలుస్తోంది. తగిన సమయం తీసుకుని నిర్ణయం చెప్పాల్సిందిగా ఆయనకు సూచించినట్టు చెబుతున్నారు. దీంతో సిద్ధరామయ్య రెండు, మూడు రోజుల్లో రాజీనామా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
కర్ణాటక నుంచి రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ఢిల్లీ సమావేశంలో చర్చించినట్టు కాంగ్రెస్ అధిష్టానం చెబుతున్నప్పటికీ ఈ సమావేశంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పిడిపై ప్రధానంగా చర్చ జరిగినట్టు చెబుతున్నారు. డీకే శివకుమార్‌కు అధికారాన్ని (సీఎం) బదిలీ చేసేందుకు అధిష్టానం ఏకగ్రీవంగా మద్దతు పలికిందని పార్టీ వర్గాలు తెలిపాయి. సుమారు 6 గంటల సేపు జరిగిన ఈ సమావేశంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో పాటు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సూర్జేవాలా పాల్గొన్నారు.
కర్ణాటకలో జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. సీఎం పదవిని సిద్ధరామయ్య చేపట్టారు. అయితే డీకే శివకుమార్‌తో రెండున్నరేళ్లు చొప్పున పదవీకాలం పంచుకునేందుకు అప్పట్లో నిర్ణయం జరగిందని ఆయన వర్గం చెబుతోంది. ఈ వాదనను సిద్ధరామయ్య తోసిపుచ్చారు. ఐదేళ్లూ తానే సీఎంగా ఉంటానని, అయితే అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని తరచు చెబుతున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం ఇటీవల మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరోసారి నాయకత్వ సమస్య తెరపైకి వచ్చింది. పార్టీ అధిష్టానం సిద్ధరామయ్య, డీకేలను న్యూఢిల్లీకి పిలవడంతో ఎట్టకేలకు సమస్య కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
కర్ణాటకలో అధికార మార్పిడి కాదు, రాజ్యసభ ఎన్నికలపైనే చర్చించా... కాంగ్రెస్ అధిష్టానం
చొరబాట్లతో అసహజ జనాభా మార్పుపై కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ.. అమిత్‌షా