Share News

సిద్దరామయ్య 'లాస్ట్ పంచ్'.. కుల గణన నివేదిక ఆమోదంతో డీకే, రాహుల్‌కు చెక్!

ABN , Publish Date - May 29 , 2026 | 11:55 AM

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా నిజానికి అంత నిశ్శబ్దంగా సాగ లేదు. తాను కుర్చీ ఖాళీ చేస్తూ.. తన తదుపరి వారసుడు డీకే శివకుమార్‌కు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఒక పవర్ ఫుల్ 'పొలిటికల్ టైమ్ బాంబ్'ను బహుమతిగా ఇచ్చి వెళ్లారు.

సిద్దరామయ్య 'లాస్ట్ పంచ్'.. కుల గణన నివేదిక ఆమోదంతో డీకే, రాహుల్‌కు చెక్!
Siddaramaiah’s ‘Quiet Revenge’? Karnataka Caste Census Puts DKS, Rahul Gandhi in Tough Spot

బెంగళూరు, మే 29 : కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య నిన్న రాజీనామా చేశారు గవర్నర్ ఆమోదించారు. అయితే, ఆయన నిష్క్రమణ అంత నిశ్శబ్దంగా సాగ లేదు. తాను కుర్చీ ఖాళీ చేస్తూ.. తన తదుపరి వారసుడు డీకే శివకుమార్‌కు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఒక పవర్ ఫుల్ 'పొలిటికల్ టైమ్ బాంబ్'ను బహుమతిగా ఇచ్చి వెళ్లారు. ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న అత్యంత వివాదాస్పద వెనుకబడిన తరగతుల కమిషన్ 'సామాజిక-ఆర్థిక, విద్యా సర్వే' (కుల గణన) నివేదికను బుధవారం రాత్రి సిద్దరామయ్య ప్రభుత్వం ఆమోదించడమే దీనికి నిదర్శనం.


తమ సొంత సామాజిక వర్గమైన కురుబలతో పాటు మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, దళితులను ఏకం చేస్తూ సిద్దరామయ్య నిర్మించుకున్న 'అహిందా' (AHINDA) కూటమే ఆయన బలమన్నది కర్ణాటకలో వినిపించే మాట. 2015లోనే మొదలైన ఈ కుల గణన ప్రక్రియ, అనేక వివాదాల తర్వాత 2025 నవంబర్‌లో కొత్త నివేదిక రూపంలో సిద్ధమైంది. ఈ నివేదికను ఆమోదించడం ద్వారా తాను కర్ణాటకలో 'వెనుకబడిన వర్గాల తిరుగులేని నాయకుడిని' అని సిద్దరామయ్య మరోసారి నిరూపించుకున్నారు. కానీ, దీని తదుపరి పరిణామాల భారాన్ని మొత్తం డీకే శివకుమార్ భుజాలపైకి నెట్టేశారు.

రాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఈ నివేదిక మింగుడుపడని పరిస్థితి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. అధికారికంగా బయటకు రాకపోయినా.. ఈ నివేదిక ప్రకారం కర్ణాటకలో వెనుకబడిన వర్గాలు, OBCలు దాదాపు 69.6 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. ముస్లింలు 14 శాతంతో అతిపెద్ద మైనారిటీ సామాజిక వర్గంగా ఉండగా.. రాష్ట్ర రాజకీయాన్ని శాసించే లింగాయత్‌లు (11శాతం), ఒక్కలిగలు (10-12శాతం) శాతం మాత్రమే ఉన్నట్లు లీకులు చెబుతున్నాయి.

డీకేఎస్‌కు సంకటం: డీకే శివకుమార్ స్వయంగా బలమైన ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇప్పుడు ఆయన ఈ నివేదికను అమలు చేస్తే.. తన సొంత సామాజిక వర్గంతో పాటు లింగాయత్‌ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఒకవేళ నివేదికను పక్కన పెడితే.. సిద్దరామయ్య వెనుక ఉన్న 'అహిందా' ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు దూరమవుతుంది.

దేశవ్యాప్తంగా 'కుల గణన అనేది సమాజానికి ఎక్స్-రే లాంటిది' అంటూ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దీనిని అమలు చేసి చూపిస్తామని 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు సిద్దరామయ్య నివేదికను ఆమోదించి వెళ్లడంతో, కేంద్రంలో రాహుల్ గాంధీ మార్క్ రాజకీయం ఇరకాటంలో పడింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ నివేదికను చట్టసభల్లో ప్రవేశపెట్టకుండా ఆలస్యం చేస్తే.. 'దేశమంతా కుల గణన అడుగుతున్న రాహుల్, మీ సొంత రాష్ట్రంలో ఎందుకు దాచేస్తున్నారు?' అంటూ బీజేపీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విశ్వసనీయతను దెబ్బతీసే అవకాశం దొరుకుతుంది.


హైకమాండ్ ఒత్తిడితో సీఎం సీటు దిగుతున్నప్పటికీ, ఢిల్లీ పీఠానికి వెళ్ళనని సిద్దరామయ్య స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్తు కర్ణాటకలోనే ఉంటుందని ఆయన అనుచరులు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసనలు చేయడం ద్వారా సంకేతాలిచ్చారు. పదవి పోయినా.. కర్ణాటక కాంగ్రెస్‌ను శాసించేది, నడిపించేది తన 'అహిందా' ఈక్వేషన్సేనని సిద్దరామయ్య ఈ కుల గణన అస్త్రంతో తేల్చిచెప్పినట్లైంది. మరి ఈ పొలిటికల్ గేమ్ నుంచి డీకే శివకుమార్, రాహుల్ గాంధీ ఎలా తప్పించుకుంటారన్నది ఆసక్తికరం. ఇక, ఈ కుల గణన నివేదికను ఆమోదించడం వల్ల డీకే శివకుమార్ (DKS) ఎదుర్కొబోయే తక్షణ సమస్యల విషయానికొస్తే..

డీకే శివకుమార్ కర్ణాటకలో అత్యంత బలమైన 'ఒక్కలిగ' సామాజిక వర్గానికి చెందిన అగ్రనేత. ఆయన సీఎం రేసులోకి రావడానికి ఆ వర్గం మద్దతు చాలా కీలకం. ఇప్పుడు లీక్ అయిన లెక్కల ప్రకారం ఒక్కలిగల జనాభా శాతం అనుకున్నదానికంటే తక్కువగా (10-12శాతం) చూపించారని ఆ వర్గ పెద్దలు, మఠాధిపతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సిద్దరామయ్య ఈ బాంబును డీకేఎస్ చేతిలో పెట్టి వెళ్లారు. ఇప్పుడు శివకుమార్ ఈ నివేదికను చట్టసభల్లో ప్రవేశపెట్టి ముందుకు తీసుకెళ్తే, ఆయన సొంత సామాజిక వర్గమే ఆయన్ను 'ద్రోహి'గా చూసే ప్రమాదం ఉంది. ఒక రకంగా ఇది ఆయన సొంత పొలిటికల్ బేస్‌ను ఆయనే దెబ్బతీసుకున్నట్లు అవుతుంది.

కర్ణాటకలో ఒక్కలిగలతో పాటు సమానంగా రాజకీయాలను శాసించే మరో వర్గం 'లింగాయత్‌లు'. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరు బీజేపీని కాదని కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున ఓటేశారన్న విశ్లేషణలున్నాయి. ఈ నివేదికలో తమ జనాభాను కూడా తక్కువ చేసి చూపించారని లింగాయత్‌లు భావిస్తున్నారు. డీకే శివకుమార్ సీఎం అయ్యాక దీనిపై సానుకూలంగా స్పందిస్తే.. లింగాయత్‌లు తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే డీకేఎస్‌కు ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది.

ఒకవేళ డీకే శివకుమార్ తన సొంత ఒక్కలిగ వర్గం కోసం లేదా లింగాయత్‌ల ఒత్తిడికి లొంగి ఈ నివేదికను పక్కన పెట్టేస్తే .. సిద్దరామయ్య వెనుక ఉన్న 70శాతం పైగా జనాభా కలిగిన 'అహిందా' కూటమి డీకేఎస్‌కు పూర్తిగా శత్రువుగా మారే ప్రమాదం కూడా ఉంది. ఒక అగ్రకుల నేత (డీకేఎస్) సీఎం కాగానే వెనుకబడిన వర్గాల హక్కులను తొక్కేశారనే ముద్ర ఆయనపై పడుతుంది. ఇది కాంగ్రెస్‌ను నమ్ముకున్న సాంప్రదాయ ఓటు బ్యాంకును పూర్తిగా దూరం చేస్తుంది.

జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ప్రతి ఎన్నికల సభలో 'కుల గణన' నినాదాన్ని బలంగా వాడుతున్నారు. ఇప్పుడు సిద్దరామయ్య నివేదికను ఆమోదించి వెళ్లిన తర్వాత.. డీకేఎస్ దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తే, రాహుల్ గాంధీ జాతీయ నినాదానికి విశ్వసనీయత తప్పుతుంది. దీనివల్ల కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ నివేదికను అసెంబ్లీలో పెట్టమని డీకే శివకుమార్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తుంది. హైకమాండ్ మాట వినకపోతే పదవికే ముప్పు రావచ్చు.

డీకే శివకుమార్ ఏ నిర్ణయం తీసుకున్నా (నివేదికను అమలు చేసినా లేదా ఆపేసినా) రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తీవ్రంగా దెబ్బతీయడానికి బీజేపీకి ఒక బలమైన అస్త్రం దొరుకుతుంది. 'కాంగ్రెస్‌లో అంతర్గత కులాల కుమ్ములాటలు' అంటూ బీజేపీ చేసే ప్రచారం డీకేఎస్ నాయకత్వాన్ని బలహీనపర్చడానికి ప్రయత్నించే అవకాశం ఉంది.

సిద్దరామయ్య ఈ నివేదికను ఆమోదించడం ద్వారా డీకే శివకుమార్‌ను ఒక 'కత్తి మీద సాము' లాంటి పరిస్థితిలోకి నెట్టారు. ఆయన ఏ అడుగు వేసినా ఒక వైపు సొంత వర్గం, మరోవైపు పార్టీ ఓటు బ్యాంకు.. ఏదో ఒకటి త్యాగం చేయక తప్పని తక్షణ సంకటాన్ని డీకేఎస్ ఎదుర్కునే అవకాశం కనిపిస్తోంది.

కులగణన ఎంత పెద్ద రాజకీయ ఆయుధమైనప్పటికీ సీఎం సిద్దరామయ్య.. దీనిని గతంలోనే ఆమోదించకపోవడానికి కారణాలు కూడా అంతే బలంగా ఉన్నాయి. 2017 లోనే తొలి నివేదిక సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆయన ఇప్పటివరకు కాలయాపన చేయడానికి ప్రధానంగా మూడు రాజకీయ, సాంకేతిక కారణాలు ఉన్నాయి.

తొలి నివేదిక (కాంతరాజ్ నివేదిక) 2017లో సిద్దరామయ్య మొదటి విడత సీఎం కాలంలోనే పూర్తయింది. కానీ అప్పటికే 2018 అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఆ సమయంలో నివేదిక లీక్‌లు బయటకు వచ్చి.. లింగాయత్‌లు, ఒక్కలిగలు తమ జనాభా శాతం తగ్గిందని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకవేళ అప్పుడు సిద్దరామయ్య ఆ నివేదికను అధికారికంగా ఆమోదించి ఉంటే, ఆ రెండు అగ్ర సామాజిక వర్గాలు కాంగ్రెస్‌కు పూర్తిగా వ్యతిరేకమయ్యేవి. ఆ ఎన్నికల భయంతోనే సిద్దరామయ్య తన మొదటి విడతలో దాన్ని పక్కన పెట్టక తప్పలేదు.

కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న అనేకమంది లింగాయత్, ఒక్కలిగ నేతలు ఈ నివేదికను తీవ్రంగా వ్యతిరేకించారు. డీకే శివకుమార్‌తో సహా పలువురు అగ్రనేతలు ఆ నివేదికపై సంతకం చేయడానికి లేదా దాన్ని ఆమోదించడానికి అప్పట్లో ఒప్పుకోలేదు. పార్టీలో అంతర్గత తిరుగుబాటు వస్తుందనే భయంతో, సొంత క్యాబినెట్ మంత్రులను నొప్పించడం ఇష్టం లేక సిద్దరామయ్య వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

2017 నాటి నివేదికపై కొన్ని సాంకేతిక విమర్శలు వచ్చాయి. నివేదికలోని అసలు రికార్డులపై నాటి కమిషన్ సభ్య కార్యదర్శి సంతకం చేయలేదనే వివాదం నడిచింది. చట్టబద్ధమైన సంతకాలు లేని నివేదికను ఆమోదిస్తే భవిష్యత్తులో కోర్టుల్లో అది నిలబడదని, పైగా ప్రతిపక్ష బీజేపీ దీనిపై న్యాయపోరాటానికి దిగుతుందని సిద్దరామయ్య వెనక్కితగ్గి ఉండవచ్చనే అభిప్రాయం కూడా ఉంది.

2023లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక సిద్దరామయ్య వెంటనే పాత నివేదికను తీసుకోలేదు. పాత డేటా 10 ఏళ్ల నాటిదని, కోర్టు చిక్కులు రాకూడదని చెప్తూ 2025 మే నెలలో కొత్తగా మరోసారి కుల గణన (జస్టిస్ మధుసూదన్ నాయక్ నేతృత్వంలో) చేయించారు. ఆ నివేదిక 2025 నవంబర్ నాటికే సిద్ధంగా ఉంది. ఇన్నాళ్లూ పార్టీ శ్రేయస్సు, ఎన్నికల సమీకరణాలు, సహచర నేతల (డీకేఎస్) అభిప్రాయాల కోసం ఆగిన సిద్దరామయ్య... ఇప్పుడు తన సీఎం పదవి పోతోందని ఖరారయ్యాక పరిస్థితి మారిపోయింది. ఇకపై తను కోల్పోయేదేమీ లేదనే స్పష్టత వచ్చాక, తన రాజకీయ భవిష్యత్తును భద్రపరుచుకోవడానికి, 'అహిందా' లీడర్‌గా తన ఇమేజ్‌ను శాశ్వతం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని భావించారు. అందుకే ఇన్నాళ్లూ తొందరపడని సిద్దరామయ్య, తాను కుర్చీ దిగిపోయే చివరి నిమిషంలో ఈ బాంబును పేల్చినట్టుగా భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

4 రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త అధ్యక్షులు

జగన్‌ అధికారం అండతో పీఏ దోపిడీ పర్వం

Updated Date - May 29 , 2026 | 01:56 PM