Share News

జగన్‌ అధికారం అండతో పీఏ దోపిడీ పర్వం

ABN , Publish Date - May 29 , 2026 | 05:08 AM

కేవలం పది వేల రూపాయల జీతం తీసుకునే వ్యక్తి జీవిత కాలంలో చిన్న ఇల్లు కట్టడం అసాధ్యం.. సెంటు భూమి కొనాలన్నా కూడా కష్టమే. కానీ వైఎస్‌ జగన్‌ వ్యక్తిగత సహాయకుడు కె.నాగేశ్వర రెడ్డి.....

జగన్‌ అధికారం అండతో పీఏ దోపిడీ పర్వం

  • పది వేల జీతం నుంచి కేఎన్‌ఆర్‌ వందల కోట్లకు కబ్జాలు, వసూళ్లు, సెటిల్మెంట్ల జోరు

  • ఎన్‌ఆర్‌ఐని బెదిరించి కృష్ణాలో 40 ఎకరాలు స్వాహా

  • తిరుపతిలో హథీరామ్‌ జీ మఠం భూముల కబ్జా

  • బెజవాడలో కార్ల షోరూమ్‌లో వాటా.. సెటిల్మెంటే

  • కేఎన్‌ఆర్‌ ఇల్ల్లు, కార్ల షోరూమ్‌లో పోలీసుల తనిఖీ

  • వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్‌ రెడ్డికి నోటీసు

  • కేఎన్‌ఆర్‌కు బినామీ అని సిట్‌కు ఆధారాలు

అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): కేవలం పది వేల రూపాయల జీతం తీసుకునే వ్యక్తి జీవిత కాలంలో చిన్న ఇల్లు కట్టడం అసాధ్యం.. సెంటు భూమి కొనాలన్నా కూడా కష్టమే. కానీ వైఎస్‌ జగన్‌ వ్యక్తిగత సహాయకుడు కె.నాగేశ్వర రెడ్డి(కేఎన్‌ఆర్‌) మాత్రం వందల కోట్ల ఆస్తులు సంపాదించారు. ఒకప్పుడు ప్రైవేటు ఉద్యోగిగా పదివేల రూపాయల జీతంతో పనిచేసిన ఆయన జగన్‌ వద్ద పీఏగా చేరాక అక్రమార్జనకు అంతూ పొంతూ లేకుండా పోయింది. జగన్‌ అధికారమే వరంగా కేఎన్‌ఆర్‌ లక్షలతో మొదలు పెట్టి కోట్లు వసూలు చేశారు. మూడు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు సంపాదించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం స్కామ్‌లో నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డితో ఆయన నెరిపిన వ్యవహారంపై సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. ఆయన ఆస్తుల చిట్టా చూసి అవాక్కవుతున్నారు. మంత్రిగా పనిచేసిన నాయకుడి కన్నా ఎక్కువే ఆస్తులు ఉన్నాయంటూ ఆయన బాధితులే పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. దీంతో సిట్‌ బృందాలు గురువారం బెజవాడలో మాచవరం వెటర్నరీ కాలనీలో ఉన్న కేఎన్‌ఆర్‌ ఇంట్లో సోదాలు చేశారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కేఎన్‌ఆర్‌కు వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్‌ రెడ్డి బినామీగా ఉన్నట్టు సిట్‌ అధికారులకు ఆధారాలు లభించాయి. దీంతో తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి సమీపంలోని శివశంకర్‌ రెడ్డి నివాసానికి వెళ్లి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అలాగే కేఎన్‌ఆర్‌ సెటిల్మెంట్‌ ద్వారా భాగస్వామ్యం దక్కించుకున్నట్లు ఆరోపణలున్న కార్ల షోరూమ్‌లో సిట్‌ అధికారులు సోదాలు చేపట్టారు. విజయవాడలో రామవరప్పాడులోని లక్కీ హ్యుందాయ్‌ షోరూమ్‌లో తనిఖీలు చేసి.. శుక్రవారం విచారణకు రావాలని పార్టనర్‌ ఉస్మాన్‌ సందీ్‌పకు నోటీసులు ఇచ్చారు. ఇద్దరి మధ్య డబ్బు వ్యవహారంపై విచారించి కీలక వివరాలు రాబట్టనున్నట్టు తెలుస్తోంది.


జగన్‌ పాలనలో సెటిల్మెంట్లు

2019లో జగన్‌ సీఎం అయ్యాక 2024 వరకూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేఎన్‌ఆర్‌ సెటిల్మెంట్లు చేశారు. వందల కోట్ల ఆస్తులు, విశాఖపట్నం విమానాశ్రయం నుంచి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ వరకూ ఎకరాలకు ఎకరాల భూములు సెటిల్మెంట్ల ద్వారా సంపాదించినట్లు సిట్‌కు ఆధారాలు లభించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు... తిరుమల కొండకింద హథీరామ్‌ జీ మఠం భూములను అప్పటి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డితో కలిసి కబ్జా చేశారు. కొన్ని భూముల్ని అర్జున్‌ దాస్‌ అనే వ్యక్తి విక్రయించగా, అతన్ని బెదిరించి వైసీపీ నేతలు ఎకరాలకు ఎకరాలు కొట్టేశారు. జగన్‌ సొంత పత్రికలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి సైతం రెండెకరాలు కొట్టేసి వైద్యురాలైన భార్యకు ఆసుపత్రి నిర్మించే ప్రయత్నాలు చేశారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడంతో నిర్మాణం సాధ్యం గాక ఆపేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్‌కు ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పిస్తానంటూ జగన్‌ పీఏ రూ.5 కోట్లు తీసుకుని తిరుపతిలో స్థిరాస్తి కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పలువురు ఆశావహులతో టికెట్లు ఇప్పిస్తానని పెద్దఎత్తున వసూలు చేశారు. అప్పటికే పదవిలో ఉన్న వారిని మీపై ఏజెన్సీ, ఇంటెలిజెన్స్‌ నెగిటివ్‌ నివేదిక ఇచ్చిందని, సీఎంకు పంపకుండా ఉండాలంటే ముడుపులు ఇవ్వాలని కోట్ల రూపాయలు వసూలు చేశారు. ప్రకాశం జిల్లా దర్శి వద్ద భూ పంచాయతీ చేసి పదెకరాలు దక్కించుకున్నారు. కృష్ణా జిల్లా సరిహద్దుల్లో రాజధాని అమరావతికి అనుకూలంగా ఉండే చోట కేఎన్‌ఆర్‌ ఏకంగా 40 ఎకరాలను అతి తక్కువ ధరకు కొట్టేసినట్లు పోలీసు ఉన్నతాధికారులకు వైసీపీనేతలే ఆధారాలు పంపించినట్లు తెలిసింది. అమెరికాలో ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించిన భూమిని సమీప బంధువులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అప్పటి సీఎం జగన్‌కు బాధితులు లేఖ రాశారు. దీన్ని ముందుగా చూసిన కేఎన్‌ఆర్‌ ఆ వివాదంలోకి తలదూర్చి సెటిల్మెంట్‌ చేశారు. రూపాయి విలువైన భూమికి పది పైసలు ఇచ్చి బలవంతంగా రిజిస్టర్‌ చేయించుకున్నట్లు సమాచారం. విశాఖ విమానాశ్రయం సమీపంలో ప్రభుత్వ భూములు, ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు భారీగానే పోగేసుకున్న కేఎన్‌ఆర్‌కు.. గతప్రభుత్వంలో ఉన్నతస్థానంలోని ఐఏఎస్‌ సహకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌, బెంగళూరులోనూ ఇళ్లు ఉన్నాయి.


త్వరలో ఈడీ రంగంలోకి..

భార్య కోసం కేఎన్‌ఆర్‌ తీసుకున్న బంగారు బహుమతులు రెండున్నర కిలోలు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. బామ్మర్ది భాగస్వామ్యంతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఏర్పాటు చేయడంపై ఆరా తీస్తున్నారు. కేఎన్‌ఆర్‌ భార్య ఖాతాలోకి లక్షలకు లక్షలు వరదలా జమై రూ.19.85 కోట్లకు చేరిన లావాదేవీలపైనా దృష్టిపెట్టారు. బుధవారం నాడు విచారణలో అన్నింటికీ ఆడిటర్‌ పేరు చెప్పిన కేఎన్‌ఆర్‌.. గురువారం పలు అక్రమ లావాదేవీలు జరిగినట్టు అంగీకరించినట్లు సమాచారం. రూ.వందల కోట్ల ఆస్తుల వివరాలు సిట్‌ ఆయన ముందుంచడంతో.. అవన్నీ లిక్కర్‌ ముడుపుల నుంచి కొనుగోలుచేసినవి కాదంటూ అసలు గుట్టు బయట పెట్టినట్లు తెలిసింది. ఈ వివరాలన్నీ ఇప్పటికే సిట్‌ అధికారుల నుంచి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ త్వరలో జగన్‌ పీఏను ప్రశ్నించి ఉచ్చు బిగించే అవకాశముంది.

కార్ల షోరూమ్‌లో వాటా కథ ఇదీ..

విజయవాడలో రామవరప్పాడులోని లక్కీ హ్యుందాయ్‌ కార్ల షోరూమ్‌లో దౌర్జన్యంగా కేఎన్‌ఆర్‌ వాటా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ షోరూమ్‌ నుంచి కొన్ని కార్లను ఆర్టీఏ అనుమతి లేకుండా విక్రయించడం, కొందరి దగ్గర డబ్బులు తీసుకుని వాహనాలు ఇవ్వకపోవడంపై రవాణా శాఖకు గత వైసీపీ ప్రభుత్వంలో ఫిర్యాదులు అందాయి. అప్పట్లో అధికారులు గట్టిగా వ్యవహరించడంతో కార్ల షోరూమ్‌ యజమాని విజయవాడకు చెందిన ఒక యువ నాయకుడి సహకారం కోరినట్లు తెలిసింది. దీంతో ఆ యువ నేత కార్ల షోరూమ్‌ యజమాని సమస్య పరిష్కరించాలని కేఎన్‌ఆర్‌ను కోరారు. దీంతో సమస్య పరిష్కరిస్తానంటూ కేఎన్‌ఆర్‌ 51శాతం వాటా లాక్కున్నట్లు తెలుస్తోంది. అందుకుగానూ రూ.2 కోట్లు చెల్లించినట్లు చూపిన జగన్‌ పీఏ ఆ సొమ్ముకూడా ఇవ్వలేదని సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కార్ల షోరూమ్‌ యజమాని ఎదురు తిరగగా, స్థానిక నేతలతో బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.


టికెట్లు ఇప్పిస్తానని వసూళ్లు

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో కేఎన్‌ఆర్‌ రూ.వందల కోట్ల ఆస్తులు పోగేశారు. దీనిపై పోలీసులు ఆరా తీయగా.. ఆయన దందాలు, వసూళ్లు వెలుగుచూశాయి. అధికారంలోకి రాకముందు జగన్‌ పాదయాత్ర చేపడితే, కేఎన్‌ఆర్‌ వసూళ్లు మొదలుపెట్టారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలతో రెండు, మూడు లక్షల రూపాయలు తీసుకుని జగన్‌తో ఫొటోలు తీయించే స్థాయి నుంచి 2019లో నాలుగైదు కోట్లు తీసుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసేవారికి ఎన్నికల బీ ఫారాలు ఇప్పించే స్థాయికి ఎదిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యేగా ఉన్న ఒక బీసీ నాయకుడు టికెట్‌ కోసం కేఎన్‌ఆర్‌ కోట్లాది రూపాయలు తీసుకున్నాడంటూ ముఖ్యమంత్రి అయ్యాక జగన్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఉభయ గోదావరి జిల్లాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆశావహుల నుంచీ ఆయన భారీగా వసూలు చేశారు. తన దగ్గరికి రాని వారిని మీపై నివేదికలు వ్యతిరేకంగా వచ్చాయంటూ బెదిరించి వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - May 29 , 2026 | 05:08 AM