Share News

గోవుల బర్త్ సర్టిఫికెట్ చూపించాల్సిందే.. వాహనాన్ని అడ్డుకున్న బెంగాల్ ఎమ్మెల్యే

ABN , Publish Date - May 17 , 2026 | 08:44 PM

గోవుల అక్రమ రవాణాపై బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలోని ప్రభుత్వం కొరఢా ఝలిపించింది. ఈ నేపథ్యంలో పశువులను తరలిస్తున్న ఒక వాహనాన్ని బీజేపీకి కొత్తగా ఎన్నికైన మహిళా ఎమ్మెల్యే రేఖా పాత్ర అడ్డుకున్నారు. కబేళాకు తరలించాలంటే ఆవుల బర్త్ సర్టిఫికెట్ చూపించాల్సిందేనని పట్టుపట్టారు.

గోవుల బర్త్ సర్టిఫికెట్ చూపించాల్సిందే.. వాహనాన్ని అడ్డుకున్న బెంగాల్ ఎమ్మెల్యే
BJP MLA Rekha Patra

కోల్‌కతా: గోవుల అక్రమ రవాణాపై బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలోని ప్రభుత్వం కొరఢా ఝలిపించింది. ఈ నేపథ్యంలో పశువులను తరలిస్తున్న ఒక వాహనాన్ని బీజేపీకి కొత్తగా ఎన్నికైన మహిళా ఎమ్మెల్యే రేఖా పాత్ర (Rekha Patra) అడ్డుకున్నారు. కబేళాకు తరలించాలంటే ఆవుల బర్త్ సర్టిఫికెట్ చూపించాల్సిందేనని పట్టుపట్టారు. కాగా, ప్రభుత్వ కొత్త ఆదేశాలపై తృణమూల్ కాంగ్రెస్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.


హింగల్‌గంజ్‌లోని లేబుఖలీ ప్రాంతంలో శనివారంనాడు ఆవులను తరలిస్తున్న వాహనాన్ని రేఖా పాత్ర అడ్డుకున్నారు. హింగల్‌గంజ్‌ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆమె ఉన్నారు. పశువులను వాహనం నుంచి కిందకు దింపించి రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు వాటిని కట్టించారు. వాటికి గడ్డి, నీళ్లు సమకూర్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలను గుర్తు చేస్తూ, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 14 ఏళ్ల లోపు ఉన్న గోవులను కబేళాకు తరలించరాదని స్పష్టం చేశారు. ఇందుకు భిన్నంగా ఎవరు అక్రమంగా ఆవులను తరలించినా తాము అడ్డుకుంటామని, ఆవుల బర్త్ సర్టిఫికెట్ చూపించాల్సిందిగా అడుగుతామని అన్నారు. లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు.


తృణమూల్ ఆశ్చర్యం

కబేళాకు వెళ్తున్న గోవుల బర్త్ సర్టిఫికెట్ చూపించాలని బీజేపీ ఎమ్మెల్యే అడగటంపై తృణమూల్ కాంగ్రెస్ ఆశ్యర్యం వ్యక్తం చేసింది. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అమల్లో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా గోవులకు బర్త్ సర్టిఫికెట్ జారీ చేసి ఉంటే ఎమ్మెల్యే చూపించాలని కోరింది. అలా చూపిస్తే అది అందరికీ ఒక రిఫరెన్స్‌గా ఉంటుందని పేర్కొంది. సర్టిఫికెట్ జారీ చేసే అథారిటీ ఎవరికి ఉందో కూడా అందరికీ తెలుస్తుందని వ్యాఖ్యానించింది.


ఇవి కూడా చదవండి..

20 మందితో కొత్త క్యాబినెట్‌.. గవర్నర్‌కు లిస్ట్ అందజేసిన సతీశన్

మోదీ అప్పీల్‌తో అధికారుల విదేశీ పర్యటనలపై గోవా సర్కార్ నిషేధం

Updated Date - May 17 , 2026 | 08:50 PM