Share News

మోదీ అప్పీల్‌తో అధికారుల విదేశీ పర్యటనలపై గోవా సర్కార్ నిషేధం

ABN , Publish Date - May 17 , 2026 | 06:25 PM

ఆర్థిక క్రమశిక్షణ పాటించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిపై బీజేపీ సారథ్యంలోని గోవా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంది. ప్రభుత్వాధికారుల విదేశీ పర్యటనపై నిషేధం విధించింది.

మోదీ అప్పీల్‌తో అధికారుల విదేశీ పర్యటనలపై గోవా సర్కార్ నిషేధం
Pramod Sawant

పనజి: ప్రజలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిపై బీజేపీ సారథ్యంలోని గోవా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ప్రభుత్వాధికారుల విదేశీ పర్యటనలపై నిషేధం విధించింది. ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం లభించిన అన్ని విదేశీ పర్యటనలను రద్దు చేస్తున్నట్టు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Pramod Sawant) ప్రకటించారు. ఈమేరకు ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు జారీచేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది.


పర్యాటక ప్రాంతం కావడంతో గోవాలోని పలు శాఖల అధికారులు తరచు స్టడీ టూర్స్‌ కోసం విదేశాలకు వెళ్తుంటారు. విదేశీ పర్యటనలకు టూరిజం శాఖ ఎక్కువ మొత్తాన్ని వెచ్చిస్తూ ఉంటుంది. సీనియర్ అధికారులు ఎక్స్‌పోలు, ట్రావెల్ మీట్స్‌ కోసం విదేశాలకు వెళ్తుంటారు.


వ్యక్తిగత భద్రత సగానికి తగ్గింపు

ప్రధానమంత్రి పిలుపు మేరకు ప్రమోద్ సావంత్ తన భద్రతా కాన్వాయ్‌ను కూడా సగానికి సగం తగ్గించారు. ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగానికి నిర్ణయం తీసుకుంటూ ఈవీ ఛార్జింగ్ ఎకోసిస్టమ్‌ను విస్తరించాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు. గ్లోబల్ యుద్ధాలు, ఇందువల్ల ఎదురవుతున్న సవాళ్లను భారతదేశం సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అందరూ కలిసిరావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల వరుస విజ్ఞప్తులు చేశారు. విదేశీ మారకద్రవ్య నియంత్రణకు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని, విదేశీ పర్యటనలను కుదించుకోవాలని, ఏడాది వరకూ బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి..

కేరళం క్యాబినెట్ కూర్పు ఇదే.. సీఎం పదవి సహా కాంగ్రెస్‌కు 12 మంత్రి పదవులు

వయనాడ్‌ను మరిచిపోండంటూ రాహుల్, ప్రియాంకపై పోస్టర్లు

Updated Date - May 17 , 2026 | 06:32 PM