Share News

వయనాడ్‌ను మరిచిపోండంటూ రాహుల్, ప్రియాంకపై పోస్టర్లు

ABN , Publish Date - May 17 , 2026 | 04:04 PM

కాంగ్రెస్ సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకుని కేరళంలోని వయనాడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సమీపంలో వెలిసిన పోస్టర్లు సంచలనమయ్యాయి. ప్రియాంక గాంధీ వాద్రా నియోజకవర్గమైన వయనాడ్‌లో ఈనెల 13న ఈ పోస్టర్లు వెలిసాయి.

వయనాడ్‌ను మరిచిపోండంటూ రాహుల్, ప్రియాంకపై పోస్టర్లు
Posters against Rahul Gandhi and Priyanka Gandhi

తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకుని కేరళంలోని వయనాడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సమీపంలో వెలిసిన పోస్టర్లు సంచలనమయ్యాయి. ప్రియాంక గాంధీ వాద్రా నియోజకవర్గమైన వయనాడ్‌లో ఈనెల 13న ఈ పోస్టర్లు వెలిసాయి. ఆ సమయంలో కేరళం తదుపరి సీఎం ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం అభ్యర్థిగా కేసీ వేణుగోపాల్‌‌కు వ్యతిరేకంగా ప్రియాంక, రాహుల్ గాంధీకి హెచ్చరికలు ఈ పోస్టర్లలో చోటుచేసుకున్నాయి.


'మిస్టర్ రాహుల్... కేసీ వేణుగోపాల్ మీకు బ్యాగ్ బ్యారర్ కావచ్చు. కానీ కేరళం ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు' అని ఒక పోస్టర్‌లో రాసి ఉంది. అలాంటి నిర్ణయమే తీసుకుంటే (కేసీనే ఎన్నుకుంటే) వయనాడ్ మీకు మరో అమేథీ అవుతుంది.. అని 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోవడాన్ని పరోక్షంగా మరో పోస్టర్‌లో ప్రస్తావించారు. 'వయనాడ్‌ను రాహుల్, ప్రియాంక మరిచిపోవచ్చు, ఇక్కడి నుంచి మీరు మరోసారి గెలిచే ప్రసక్తే లేదు' అని ఇంకో పోస్టర్‌లో రాసి ఉంది.


కేసు నమోదు

సీసీటీవీ పుటేజ్ ఆధారంగా ఒక వ్యక్తి గోడలకు పోస్టర్ అంటించినట్టు గుర్తించామనీ, అతన్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వయనాడ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.సిద్ధిఖ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు.


కేరళం తదుపరి సీఎం ఎవరనే సస్పెన్స్ మే 4వ నుంచి కొనసాగుతూ వచ్చింది. కేరళంలోని 140 సీట్లలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ 102 సీట్లు గెలుచుకుంది. సీఎం అభ్యర్థి విషయంలో కేసీ వేణుగోపాల్, గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, పార్టీ సీనియర్ నేత రమేష్ చెన్నితాల మధ్య పోటీ నెలకొంది. అయితే చివరకు సతీశన్‌ను సీఎం అభ్యర్థిగా మే 14న కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో సస్పెన్స్‌కు తెరపడింది.


ఇవి కూడా చదవండి..

యూపీలో బుల్డోజర్ యాక్షన్... 240 లాయర్ ఛాంబర్ల కూల్చివేత షురూ

నీట్ పేపర్ లీక్ కేసు.. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలు..

Updated Date - May 17 , 2026 | 04:10 PM