Share News

యూపీలో బుల్డోజర్ యాక్షన్... 240 లాయర్ ఛాంబర్ల కూల్చివేత షురూ

ABN , Publish Date - May 17 , 2026 | 03:00 PM

ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో అక్రమ కట్టడాల కూల్చివేతకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మరోసారి 'బుల్డోజర్ యాక్షన్'కు దిగింది. జిల్లా మెజిస్ట్రేట్ (DM) కార్యాలయం వెలుపల 240 లాయర్ ఛాంబర్ల కూల్చివేత పనులు ప్రారంభం కావడంతో ఒకింత ఉద్రిక్తత చోటుచేసుకుంది.

యూపీలో బుల్డోజర్ యాక్షన్... 240 లాయర్ ఛాంబర్ల కూల్చివేత షురూ
Demolition work in Lucknow

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో అక్రమ కట్టడాల కూల్చివేతకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మరోసారి 'బుల్డోజర్ యాక్షన్'కు దిగింది. జిల్లా మెజిస్ట్రేట్ (DM) కార్యాలయం వెలుపల 240 లాయర్ ఛాంబర్ల కూల్చివేత పనులు అదివారంనాడు ప్రారంభం కావడంతో ఒకింత ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాత హైకోర్టు కాంప్లెక్స్, సెషన్స్ కోర్టు, రిజిస్ట్రీ కార్యాలయం, డీఎం కార్యాలయం సమీపంలోని అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో తొలగిస్తున్నారు.


ఛాంబర్ల అక్రమ నిర్మాణాలపై ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు కావడంతో వాటి కూల్చివేతకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. అక్రమ కట్టడాలను మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించి వాటిపై గత మంగళవారంనాడు నోటీసులు అంటించింది. మే 16వ తేదీలోగా ఆక్రమణదారులు ఆ కట్టడాలను తొలగించాలని ఆదేశించింది.


లాయర్ల నిరసన.. స్వల్పంగా లాఠీచార్జి

స్వాస్థ్య భవన్ క్రాసింగ్ వద్ద కూల్చివేత డ్రైవ్ ప్రారంభం కావడంతో లాయర్లు నిరసనకు దిగారు. కూల్చివేతలను నిలిపివేయాలంటూ బుల్డోజర్లను అడ్డుకుని బైఠాయించారు. అఖండ రామాయణ పఠనం సాగించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి జరిపారు. అనంతరం కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. నిరసనల్లో బ్రాహ్మణులపై పోలీసులు లాఠీలు ఝలిపించారని పలువురు లాయర్లు ఆరోపించారు.


లఖ్‌నవూ సెషన్స్ కోర్టులో 27,000 మంది లాయర్లు ఉండగా, పరిమిత సంఖ్యలో మాత్రమే ఛాంబర్లు ఉన్నాయి. దీంతో రిజిస్ట్రీ కార్యాలయం మార్గంలోని ఒక డ్రైనేజీని ఆక్రమించి లాయర్లు ఛాంబర్లు నిర్మించినట్టు ఆరోపణలున్నాయి. అయితే నోటీసుల తర్వాత చాలామంది లాయర్లు తమ ఛాంబర్లను స్వచ్ఛందంగా తొలగించారు. కాగా, హైకోర్టు ఆదేశాల ప్రకారమే తాము అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపట్టామని, తమకు సహకరించాల్సిందిగా లాయర్లను కోరామని, తగినంత పోలీసు బలగాలను మోహరించామని డీసీపీ (వెస్ట్) కమలేష్ దీక్షిత్ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్

నీట్ పేపర్ లీక్.. 14 రోజుల సీబీఐ కస్టడీకి నిందితురాలు

Updated Date - May 17 , 2026 | 03:00 PM