తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన విశాల్ ఎక్స్ పోస్టు..
ABN , Publish Date - May 17 , 2026 | 04:42 PM
తమిళనాడు మంత్రులకు శాఖల కేటాయింపు రాజకీయ, సినీ వర్గాల్లో ఒక్కసారిగా పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. ఎమ్మెల్యే రాజ్ మోహన్‌కి ఫిల్మ్ టెక్నాలజీ & సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ అప్పగించడంపై ప్రముఖ సినీ హీరో విశాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
చెన్నై: మే 10వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. విజయ్‌తో పాటు మరో 9 మంది మంత్రులు ప్రమాణం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నిన్న (శనివారం) వారికి మంత్రిత్వ శాఖలు కేటాయిస్తూ ప్రకటన జారీ చేశారు. అయితే, తాజాగా ఈ శాఖల కేటాయింపు తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో ఒక్కసారిగా పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. మంత్రిగా రాజ్ మోహన్‌కి ఫిల్మ్ టెక్నాలజీ & సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ సహా పాఠశాల విద్య, తమిళ భాష, సంస్కృతి అభివృద్ధి వంటి పలు శాఖలు కేటాయించారు. అయితే, రాజ్ మోహన్‌కి సినిమాటోగ్రఫీ శాఖ అప్పగించడంపై ప్రముఖ సినీ హీరో విశాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ మేరకు సీఎం విజయ్‌ని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఫిల్మ్ టెక్నాలజీ శాఖను సినీ రంగంపై అనుభవం లేని వ్యక్తికి అప్పగించడం నిరాశ కలిగించిందని విశాల్ అన్నారు. సినీ పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర సమస్యల్లో ఉందని.. నిర్మాతలు, ప్రొడక్షన్ హౌస్‌లకు ఉపశమనం అవసరమని పేర్కొన్నారు. సినీ రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న సీఎం విజయ్ ఈ సమస్యలను బాగా అర్థం చేసుకోగలరని విశాల్ అభిప్రాయపడ్డారు. సినీ రంగం గురించి ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తికి సమస్యలను ఎలా తెలియజేయగలమని అన్నారు. మంత్రి రాజ్ మోహన్‌ని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని, ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే అంటూ ఎక్స్ వేదికగా విశాల్ పోస్టు పెట్టారు.
తమిళనాడు ప్రభుత్వానికి హీరో విశాల్ కీలక సూచనలు..
1. తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో టికెటింగ్ వ్యవస్థను తీసుకురావాలి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు ప్రేక్షకులకు టికెట్‌పై అదనపు భారం తగ్గుతుంది.
2. 'వన్ ఇండియా-వన్ ట్యాక్స్' విధానానికి విరుద్ధంగా ఉన్న లోకల్ బాడీ ట్యాక్స్‌ను రద్దు చేయాలి.
3. చిన్న సినిమాలకు ఇచ్చే సబ్సిడీని ప్రతి ఏడాది పెంచాలి.
అరుణ్ విజయ్ ఎక్స్ పోస్ట్..
హీరో విశాల్ వ్యాఖ్యలపై నటుడు అరుణ్ విజయ్ పరోక్షంగా స్పందించారు. విశాల్ పేరు ప్రస్తావించకుండానే ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రజల విశ్వాసంతో దళపతి విజయ్ ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయన నిర్ణయాలను గౌరవించాలన్నారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని ఎన్నికై వచ్చిన తర్వాత నచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు. విజయ్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే కాబట్టి సమస్యలను కచ్చితంగా అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు. ముందుగానే విమర్శలు చేయకుండా ఫలితాల కోసం వేచి చూడాలని అరుణ్ విజయ్ చెప్పుకొచ్చారు. కాగా, ఈ వ్యవహారం ప్రస్తుతం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
త్రివేండ్రం- నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం..
వయనాడ్‌ను మరిచిపోండంటూ రాహుల్, ప్రియాంకపై పోస్టర్లు