Share News

మాక్ పార్లమెంట్‌లో రాహుల్‌ను ప్రధానమంత్రి చేయండి.. కాంగ్రెస్‌పై బీజేపీ సెటైర్లు

ABN , Publish Date - Oct 31 , 2026 | 09:19 PM

ఇండి కూటమి నిర్వహించిన మాక్ పార్లమెంట్‌పై భారతీయ జనతా పార్టీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు.

మాక్ పార్లమెంట్‌లో రాహుల్‌ను ప్రధానమంత్రి చేయండి.. కాంగ్రెస్‌పై బీజేపీ సెటైర్లు

ఇంటర్నెట్ డెస్క్: ఇండి కూటమి నిర్వహించిన మాక్ పార్లమెంట్‌పై భారతీయ జనతా పార్టీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. మాక్ పార్లమెంట్‌లో రాహుల్ గాంధీని మాక్ ప్రైమ్ మినిస్టర్ చేయాలంటూ బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర ఎద్దేవా చేశారు. ఆ తరువాత రాహుల్ చుట్టూ కాంగ్రెస్ నేతలు చేరి భజన కార్యక్రమాలు నిర్వహించాలని చురకలంటించారు. కాగా ఎన్నికల ప్రక్రియ ‘సర్’లో అవకతవకలు జరిగాయంటూ ఇండి కూటమి నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలని ఆ కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలో భాగంగా ఈరోజు మాక్ పార్లమెంట్ నిర్వహించి, సీఈసీపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఎంపీ సంబిత్ పాత్ర కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.


ఎన్నికల్లో బీజేపీపై గెలిచి అధికారంలోకి రాలేని రాహుల్.. ఆందోళనలతో రావాలని అనుకుంటున్నారని సంబిత్ విమర్శించారు. ‘కాంగ్రెస్ నిరసనలు చేస్తోంది దేశం కోసమూ కాదు. విద్యార్థుల కోసమూ కాదు. కేవలం అధికారం కోసమే ఆ పార్టీ నిరసనలు చేస్తోంది. ప్రభుత్వాన్ని కూల్చటమే కాంగ్రెస్ నేతల లక్ష్యం. గతంలో బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల వంటి ఘటనలు ఇక్కడా సృష్టించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు’ అంటూ ఆయన ధ్వజమెత్తారు.


ఈ వార్తలూ చదవండి

జ్ఞానేశ్‌ను తప్పించే వరకు పోరాటం ఆగదు.. మాక్ పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ

ఇండియా కూటమి మాక్ పార్లమెంట్.. సీఈసీపై ఆరు ప్రధాన అభియోగాలు ఇవే..

Updated Date - Oct 31 , 2026 | 09:20 PM