ఓటింగ్‌కు ముందు మోదీని కలిసిన రిజిజు
ABN , Publish Date - Apr 17 , 2026 | 05:39 PM
లోక్‌సభలో మూడు బిల్లులపై కీలకమైన ఓటింగ్ జరుగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఓటింగ్ మరి కాసేపట్లో ఉందనగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
న్యూఢిల్లీ: లోక్‌సభలో మూడు బిల్లులపై కీలకమైన ఓటింగ్ జరుగనుండటంతో శుక్రవారం సాయంత్రం లోక్‌సభలో ఉత్కంఠ నెలకొంది. ఓటింగ్ మరి కాసేపట్లో ఉందనగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు, డీలిమిటేషన్‌పై లోక్‌సభ జరిగిన సుదీర్ఘ చర్చకు హోం మంత్రి అమిత్‌షా సాయంత్రం 6 గంటలకు సమాధానం ఇస్తారు. అనంతరం సభలో ఓటింగ్ జరుగుతుంది.
పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వాలని ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం పిలుపునిచ్చారు. పార్లమెంట్ సభ్యులంతా తమ మనస్సాక్షికి అనుగుణంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని మహిళా శక్తిని గౌరవించడానికి ఇదో గొప్ప అవకాశమని ఆయన కొనియాడారు. మహిళలకు తగిన హక్కులను కల్పించడంలో అందరం సమష్టిగా చరిత్ర సృష్టించాలన్నారు. ఏకాభిప్రాయంతో ఈ సవరణను ఆమోదించాలని, దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని 'ఎక్స్' వేదికగా ప్రధాని కోరారు. ఈ సవరణ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందితే దేశంలో మహిళా శక్తి మరింత బలోపేతమవుతుందని, ఫలితంగా దేశ ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని అన్నారు. 'రండి.. ఈ రోజు మనమందరం కలిసి చరిత్ర సృష్టిద్దాం' అని మోదీ పిలుపునిచ్చారు.
కాగా, రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 వంతు సుమారు 362 ఓట్లు మెజారిటీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేకపోవడంతో బిల్లుల ఆమోదం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మ్యాజిక్ ఫిగర్‌పై ఎన్డీయే మాత్రం ధీమా వ్యక్తం చేస్తోంది. సొంత బలం 293 మాత్రమే ఉన్నప్పటికీ, తటస్థ పార్టీల మద్దతుతో మేజిక్ ఫిగర్ దాటుతామని ఎన్డీయే ఎంపీలు చెబుతున్నారు. మరోవైపు డీలిమిటేషన్ క్లాజ్‌ను తొలగించకపోతే బిల్లులను అడ్డుకుంటామని కాంగ్రెస్ నేతృత్వంలోని 'ఇండియా' కూటమి స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
మీ మనస్సాక్షి చెప్పిందే వినండి.. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి: మోదీ
ఇది మహిళా బిల్లు కాదు, 2023లోనే బిల్లును ఆమోదించాం: రాహుల్