‘రిపబ్లిక్ డే’లో మోదీ పక్కన నిలబడిన యువకుడు... ఎవరంటే..
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:30 PM
2026 జనవరి 26న గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరేడ్ (Republic Day Parade)లో సైనిక విన్యాసాలు, శకటాల ప్రదర్శనలను మనం ఆసక్తిగా తిలకించాం. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ పక్కన ఓ యువకుడు నిల్చుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. ఇంతకీ ఈయన ఎవరంటే..
ఇంటర్నెట్ డెస్క్: 2026 జనవరి 26న గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ పరేడ్‌లో (Republic Day Parade) సైనిక విన్యాసాలు, శకటాల ప్రదర్శనను అంతా ఆసక్తిగా తిలకించారు. ఈ వేడుకలో ఓ యువకుడు ప్రధాని నరేంద్ర మోదీ పక్కన నిల్చుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని మోదీకి, అతిథులుగా వచ్చిన ఐరోపా నేతలకు మధ్య ఆ యువకుడు వారధిగా వ్యవహరించారు. అంత పెద్ద స్థాయి నేతల మధ్య జరిగిన సంభాషణను ఎలాంటి తడబాటు లేకుండా వారికి అర్థమయ్యేలా వివరించారు. దీంతో ఆ యువకుడు ఎవరా.. అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధాని మోదీ పక్కన నిల్చుని అందరినీ ఆకట్టుకున్న ఆ వ్యక్తి పేరు సిద్ధార్థ్ బాబు. ఆయనొక ఐఎఫ్ఎస్ ఆఫీసర్. కేరళలోని కొచ్చిలో సిద్ధార్ధ్ బాబు జన్మించారు. ఇంజినీరింగ్ మెకానికల్ బ్రాంచ్‌లో పట్టా పొందిన సిద్ధార్థ్.. తర్వాత ఇ-కామర్స్ రంగంలో కొంతకాలం పాటు ఉద్యోగం చేశారు. ఆ సమయంలో ఆయన చూసిన సినిమాలు, టెలివిజన్ షోలు అంతర్జాతీయ వ్యవహారాలపై ఆసక్తిని పెంచాయి. ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రాతినిధ్యాన్ని మరింత అర్థం చేసుకునేందుకు పుస్తకాలు కూడా చదవడం ప్రారంభించారు.
ఐఎఫ్ఎస్ అధికారిగా ఎలా మారారంటే..
ప్రపంచానికి సంబంధించిన పుస్తకాలు చదివే ప్రక్రియే ఆయన లక్ష్యాన్ని నిర్ణయించింది. దీంతో తాను చేస్తున్న జాబ్ వదిలేసి.. యూపీఎస్సీ (UPSC) పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. ఈ క్రమంలో తొలిసారి పరీక్ష రాయగా విజయం పలకరించలేదు. అయినా నిరుత్సాహ పడకుండా తన లోపాలను సరిచేసుకుంటూ మరోసారి గట్టిగా ప్రయత్నం చేశాడు. యూపీఎస్సీ-2016లో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించారు. ఐఏఎస్ అయ్యే అవకాశాన్ని వదులుకుని అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఐఎఫ్ఎస్‌ను ఎంచుకున్నారు. కాలిఫోర్నియాలోని మిడిల్బరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో తన నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నారు. పలు భాషలపై పట్టు సాధించిన సిద్ధార్థ్.. చూడటానికి ప్రశాంతంగా కనిపిస్తారు. ఈ ప్రత్యేకతల కారణంగా ఆయన దౌత్య వ్యవహారాల్లో కీలకంగా మారారు. అందుకే అంతర్జాతీయ వేదికలపై ఉన్నతస్థాయి సమావేశాల్లో నేతల మధ్య సంభాషణలను సిద్ధార్థ్ సమన్వయం చేస్తుంటారు.
సిద్ధార్థ్ బాబు ప్రస్తుతం విదేశాంగ శాఖలో ఉప కార్యదర్శిగా (Europe and Americas) పనిచేస్తున్నారు. దీంతో విదేశీ నేతలతో నిత్యం సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది. గణతంత్ర దినోత్సవంలో (Republic Day) యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడుకుంటున్న సమయంలో సిద్ధార్థ్ నెట్టింట్లో వైరల్‌గా మారారు. అంతమంది అగ్రనేతల ముందు కూడా ఎంతో ప్రశాంతగా తనపని తాను చేసుకుపోయిన ఈ యువ అధికారిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
నాకు తెలియదు.. సునేత్రకు డిప్యూటీ సీఎంపై శరద్ పవార్
ఎన్‌సీపీ శాసనసభాపక్ష నేతగా సునేత్ర పవార్ ఎన్నిక